All are Equal : హైడ్రా ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ కక్ష ఉందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఆరోపణలు తిప్పికొట్టే విదంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు హైడ్రా అధికార యంత్రాంగం. సీనియర్ పోలీస్ అధికారిని నియమించడంతో రాజకీయ నాయకులను, అక్రమ కట్టడాలు చేపట్టిన వారిని బెదిరించడానికే అనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు ఎలాంటి ఆరోపణలు రావడం లేదు.
అధికారం, పలుకుబడి, డబ్బు ఉన్నవారు ఆక్రమించి కడితే సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. అదే పేదవారు తాత్కాలికంగా చిన్న గుడిసె వేసుకుంటే మాత్రం క్షణాల్లో అధికారులు వాలిపోతారు. తిరిగి పనికిరాకుండా నేల మట్టం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల హాయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతల్లో ఉన్న కేసీఆర్ హయాంలో కూడా కబ్జాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు రాజకీయ ఒత్తిడితో అధికారులు దూరంగా ఉన్నారు. ఆ అక్రమ కట్టడాల్లో హీరోలు, లీడర్లు, బిల్డర్లు, ప్రజాప్రతినిధులు చేరిపోయారు కొందరు.
చెరువులు, నాళాలు, కుంటలు కబ్జా కు గురయ్యాయి. దింతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరేది. రోడ్లన్నీ నదులై పారేవి. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. వర్షాలు పడుతున్నాయంటే హైదరాబాద్ ప్రజలు వణికిపోవాల్సిందే. అందుకే హైదరాబాద్ పరిస్థితి అద్వాన్నం అయిపోయింది. పేరుకే మహానగరం. కానీ వర్షం వస్తే మాత్రం అస్తవ్యస్తం. ఇప్పడు హైడ్రా చేపట్టిన చర్యల వలన అనేక అక్రమ కట్టడాలు నేలపాలవుతున్నాయి. ఏ ఒక్కరు కూడా నోరు మెదపడంలేదు.