Congress : తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఘనవిజయం సాధిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కామారెడ్డి పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బహుజన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ……
అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న బిజెపి అహంకారాన్ని రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారన్నారు. రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాదాన్ని తీసుకు రావాలనుకుంటున్న కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు. కంచె ఐలయ్య లాంటి మేధావులు ఈరోజు బయటకు వచ్చి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్ధించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నే 42% రిజర్వేషన్ అమలు చేయడంతో దేశ వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పేరు నిలిచిపోయిందన్నారు.