Telangana : తెలంగాణలో గల్లీ నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు రాజకీయ నాయకులు బీసీ జపం చేస్తున్నారు. వర్గం ఒకటే. కానీ రాజకీయ వర్గాలన్నీ పోరుబాటుకు సిద్ధం కావడం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ నిరుద్యోగులకు ప్రస్తుతం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ విషయాన్నీ బ్రహ్మాస్త్రంగా మలచుకున్నాయి. ఎవరికి వారే ఢిల్లీ లోనే పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తోంది. ఆర్డినెన్స్ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని కోటి ఆశలతో నమ్మకంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో ఆగస్టు 5 నుంచి 7 వరకు నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ను ఆశ్రయించే ప్రయత్నం కూడా చేయడానికి సిద్దమైనది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మాట నిలబెట్టుకోడానికి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా, చట్టపరంగా ఉన్నన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోడానికి సిద్దమైనది.
ఇది ఇలా ఉండగాగులాబీ శ్రేణులు ఏకంగా రాష్ట్రపతిని కలవడానికి సిద్దమైనారు. రాష్ట్రపతి వద్దకు కేసీఆర్ కూడా వెళ్ళడానికి సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆగష్టు నెలలో కరీంనగర్ లో బీసీ రిజర్వేషన్ కు తాము అనుకూలంగా ఉన్నామంటూ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.
కాషాయం నేతలు మాత్రం బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది బీసీ బిల్లు కాదు ముస్లిం రిజర్వేషన్ అంటున్నారు. రిజర్వేషన్ పై కాంగ్రెస్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదంటున్నారు. ముస్లిం వర్గాలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ ను తొలగిస్తేనే తాము మద్దతు ఇస్తామంటున్నారు.
ఇకపోతే జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మొదటి నుంచి బిఆర్ఎస్, బీజేపీ కంటే ముందే ఉన్నారు. ఆమె రైల్ రోకో కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్ కు మద్దతు పలికారు. ఇప్పడు ఏకంగా 72 గంటల దీక్ష చేస్తున్నట్టుగా ప్రకటించారు. అన్ని పార్టీల వారు ఢిల్లీ ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలుపుతుందా ? వెనక్కి తగ్గుతుందా వేచి చూడాల్సిందే.