Vijayasai Reddy : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుచరుల్లో ఒకరైన విజయ సాయి రెడ్డి మీడియా రంగంలో అడుగుపెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఏపీ లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతోనే విజయసాయి రెడ్డి మీడియా ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఏపీలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవలనే ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ విషయంలో ఆయనకు వైసీపీ నుంచి అవసరమైనంత మేరకు మద్దతు దొరకలేదు. ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలు నిరంతరం ఓ మీడియాలో ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కొందరు మీడియా ప్రతినిధులతో పాటు వైసీపీ నాయకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ చేతిలో మీడియా ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తొందరలోనే తాను కూడా మీడియా ఛానల్ ను ప్రారంభిస్తానని బహిరంగానే సవాల్ విసిరారు. గతంలో కూడా ఆయన ఇదే రీతిలో మాట్లాడారు. అప్పుడు అందరు కూడా ఆ విషయాన్ని వినీ, విననట్టు వదిలేశారు. కానీ తాజాగా ఆయన మాట్లాడిన మాటలు నిజమనే అభిప్రాయాలు ఏపీతో పాటు తెలంగాణాలో సైతం వ్యక్తం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఒక స్థాయిలో పేరున్న ఒక మీడియా సీఈఓను విజయసాయి రెడ్డి దగ్గరకు తీసుకున్నట్టు సమాచారం. ఇదే విషయాన్నీ అటు వైసీపీ నేతలు కూడా కొందరు నిజమే అంటున్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి వ్యవహారం బహిరంగం కావడంతో ఆయన ఏపీ లోని పలువురు మీడియా ప్రతినిధులతో పాటు కూటమి ప్రభుత్వం పై కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు సొంతింటి నుంచి కూడా ఆశించినంత మేరకు మద్దతు దొరకలేదు.అందుకనే సొంతంగా తనకో పెన్ను, పేపర్, కెమెరా, స్టూడియో ఉంటె సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయని, అదేవిదంగా ఎవరైనా తన గురించి మాట్లాడాలంటే భయం కూడా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
తెలుగులో టాప్ పొజిషన్ లో ఉన్న ఒక మీడియా సీఈఓ తో విజయ సాయి రెడ్డి ఈ పాటికే ఒప్పందం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆ సీఈఓ తీసుకుంటున్న వేతనం కంటే రెట్టింపు వేతనం ఇస్తాననే ఒప్పందం కూడా జరిగినట్టు సమాచారం. ఛానల్ ఏర్పాటుకు సన్నాహాలు పూర్తి అయినట్టు తెలుస్తోంది. ముహూర్తం కూడా దాదాపుగా విజయ దశమి అని తెలిసింది. ఛానల్ కు సంబందించిన నియామకాలు కూడా ఇప్పటికే సగం పూర్తి అయినట్టు సమాచారం. ఇక పేరు ప్రకటించి, ప్రారంభించడమే మిగిలింది.