MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాలకు అతీతంగా చెప్పాలంటే ఆమె తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె. ఉద్యమ సమయంలోనే ఒక మాట చెప్పారు కేసీఆర్. ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే తన పంటితో తీస్తా అన్నారు. అటువంటిది తన కుమార్తె కు ఏ కష్టమొచ్చినా ఆయన తట్టుకోలేరు. అంతే కాదు బిఆర్ఎస్ శ్రేణులు కూడా ముందుంటారు. రాజకీయం వేరు. రక్త సంబంధం వేరు. తీన్మార్ మల్లన్న కవిత పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో కవితకు కుటుంబ పరంగా మద్దతు ఉండాలి. చివరకు పార్టీ శ్రేణుల్లో ఏ ఒక్కరు కూడా కవితకు అండగా నిలబడలేదు. రాజకీయంగా కవిత సహాయ, సహకారంతో ఎదిగిన వారు కూడా స్పందించక పోవడం రాజకీయ వర్గాల్లో విస్మయానికి గురిచేస్తోంది.
కేటీఆర్ తో రాజకీయంగా కవిత విభేదిస్తున్నారు. బిఆర్ఎస్ అభివృద్ధిలో తన పాత్ర కూడా ఉందంటున్నారు. అయినప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు బహిరంగంగా మాట్లాడలేదు. తమ నాయకుడు కేసీఆర్ అంటూ స్పష్టం చేస్తున్నారు. కవిత ఒక ప్రత్యేకమైన గమ్యాన్ని ఎంచుకోవడంతోనే గులాబీ శ్రేణులు ఆమెకు కాస్త దూరం జరిగినట్టు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యూహం అనడానికి ఒక అర్థం ఉంది. కానీ వ్యక్తిగతంగా సమస్య ఎదుర్కొంటున్న కవితకు అండగా కుటుంబం నిలబడకపోవడమే ఇబ్బందిగా కనబడుతోంది.
తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు కవితను బాధ పెట్టాయి. ఆయన చాలా ఘోరంగా మాట్లాడినారు. అయినప్పటికీ ఆయన తన మాటలను సమర్ధించుకుంటున్నారు. మల్లన్న మాటలు ముదిరే అవకాశం కూడా కనబడుతోంది. కవితకు ఈ సమయంలో ఎంత మద్దతు లభిస్తే ఆమె అంత బలంగా తయారవుతారు. తనకు మద్దతు ఎవరు అనే విషయం కూడా కవితకు తెలిసిపోయింది. కవిత సొంత బలంతోనే రాజకీయం చేయాలని, ఎవరి మద్దతు ఉండదని ఈ పాటికే ఒక నిర్ణయం ఆమె తీసుకుంటే మల్లన్న మాటల విషయంలో ఆమె ఆయనతో ఒంటరి పోరాటానికి దిగుతారు.