KCR AND Harish : రాజకీయాల్లో అదృష్టం ఎదురుగ ఎవరికీ రాదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ఆ అవకాశం అదృష్టంగా మారుతుంది. మాజీ మంత్రి హరీష్ రావ్ ఎలాగూ అదృష్టవంతుడే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చేరిన నాటి నుంచి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తనదయిన శైలిలో సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ గీత దాటి దూకుడుగానే పనిచేస్తున్నారు. గులాబీ బాస్ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఆయన నాలుగు గోడల వరకే పరిమితం అవుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు. ఇంకేముంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చీర, గాజుల గొడవ హరీష్ రావ్ చేతికి చిక్కింది. ఉద్యమం దూకుడు మరోసారి పార్టీ శ్రేణులకు చూపించారు. తన సత్తా ఏమిటో రాష్ట్రం నడిబొడ్డున నిరూపించారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు నాయకులు, కార్యకర్తలు దాడి చేస్తున్నారనే విషయం హరీష్ రావ్ కు తెలిసింది. వెంటనే ఆయన సిద్ధిపేట నుంచి బయలు దేరారు. హైదరాబాద్ కు వెళుతున్న క్రమంలోనే జంటనగరాల్లో ఉన్న ఎమ్మెల్యేల అందరికి కబురు పెట్టారు. నేను సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వస్తున్నా. మీరు రండి అంటూ బిఆర్ఎస్ నేతలందరికీ సమాచారం అందించారు. ఒక్క ఫోన్ తో పెద్ద ఎత్తున కమిషనర్ కార్యాలయం ముందు వాలిపోయారు గులాబీ నాయకులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కు మద్దతుగా పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా విజయవంతం అయ్యింది.
పోలీసుల ఒత్తిడి తో హరీష్ రావ్ భుజానికి దెబ్బ తగిలింది. శారీరకంగా ఇబ్బంది పడ్డారు. అయినా ఒత్తిడిని తట్టుకొని పార్టీ శ్రేణులను ముందుకు నడిపించారు. వెనక్కి తగ్గలేదు. తన సోషల్ మీడియా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేసీఆర్ ఇంటికి పరిమితం. కేటీఆర్ విదేశాల్లో. ఇదే అందివచ్చిన అవకాశాన్ని తనదయిన శైలిలో సద్వినియోగం చేసుకొన్నాడని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
అధికారంలో ఉన్న పదేళ్లలో ట్రబుల్ షూటర్ గా పేరు ఉంది. కానీ పూర్తి స్తాయిలో ఎలివేషన్ మాత్రం సాధించలేక పోయారు. ఇటీవల వరదలు వచ్చిన సమయంలో హరీష్ రావ్ ఖమ్మంలో పర్యటించారు. వరద బాధితులను ఓదార్చారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ, పరామర్శ మాత్రం హరీష్ రావ్ ఆశించినంత మైలేజ్ మాత్రం రాలేదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి సంఘటనలో హరీష్ రావ్ యాక్షన్ మాత్రం అధినేత కేసీఆర్ దృష్టిని తాకేవిదంగ ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.