Mavoist : పార్టీ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అగ్రశ్రేణి నాయకులకు పుట్టెడు రోగాలు. పదికి పైగా మంచం పట్టిన నాయకులు. వీటన్నిటితో పాటు తీవ్ర నిర్బంధం. పోలీస్ బలగాలు ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తాయో తెలియక సతమతమవుతున్న మావోయిస్టులు. వీటన్నిటికి తోడుగా పార్టీ లో అంతర్గత విభేదాలు తలెత్తినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మావోయిస్టు పార్టీ నాయకుల మధ్య ఎం జరుగుతుంది. నిజంగానే పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తాయా ? షెల్టర్ జోన్ లతో విభేదిస్తున్నారా ? ఎన్నడూ లేనిది నాయకుల మధ్య విభేదాలు ఇప్పుడే ఎందుకు తలెత్తాయి ?
ఒకవైపు పోలీసు క్యాంపులు, ఎన్కౌంటర్లు, పెరిగిన పోలీస్ నిర్భందం, పోలీస్ డిపార్టుమెంట్ లో పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చాలామంది కేడర్ పారిపోవడం, లొంగిపోవడం, ఈ విధంగా భారీ నష్టాలు సంభవించడంతో మావోయిస్టులు ఆత్మ పరిశోధనలో పడిపోయారు. ఎటువంటి కార్యక్రమాలు సైతం నిర్వహించలేని స్థితిలోకి పార్టీ వెళ్లిపోయిందనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు తమ నీడను తామే నమ్మే పరిస్థితుల్లో లేరనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ కారణంతోనే కొద్ది రోజుల నుంచి ఇన్ఫార్మర్లు, కోవర్టులు అంటూ అనుమానం వచ్చిన వారిని మావోయిస్టులు చంపిన సందర్భాలు సైతం ఉన్నాయి.
ముఖ్యoగా తెలంగాణ, చత్తిస్ ఘడ్ రాష్ట్రాల కు చెందిన మావోయిస్టు నాయకుల మధ్య విభేదాలు ఏర్పడినట్టు తెలిసింది. ఇటీవలి కాలంలోనే రెండు రాష్ట్రాల నాయకుల్లో అవగాహన లోపం తలెత్తినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు పార్టీ నాయకత్వం అంతా కూడా చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోనే తలదాచుకొంది. తెలంగాణ లో అడుగుపెడితె చాలు నిఘావర్గాలకు ఉప్పందుతోంది. కనీసం ఉనికిని కూడా చాటుకోలేని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. కేవలం మీడియాకు ప్రకటనలు ఇవ్వడానికే పరిమితమైనారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి చెందిన ప్రధాన నాయకత్వం అంతా కూడా చత్తిస్ ఘడ్ రాష్ట్రములో స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఒక్క మావోయిస్టు కూడా రాష్ట్రంలో అడుగుపెట్టలేడు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులకు, దళ సభ్యులకు చత్తిస్ ఘడ్ లో అక్కడి నాయకులు స్థావరం ఇవ్వడం లేదని సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న స్థావరం విషయంలో వివాదం తలెత్తినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ప్రాంత నాయకులు ఇక్కడ ఉండటంతోనే స్థావరాలు తెలిసిపోతున్నాయి. ఇన్ ఫార్మర్, కోవర్ట్ వ్యవస్థ కూడా తెలంగాణ నాయకుల వల్లనే పెరిగి పోయిందనే అసంతృప్తితో చత్తిస్ ఘడ్ మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ ఘడ్ లో పార్టీ కి ఎన్ కౌంటర్ ల ముప్పు తప్పడం లేదనే వాదన రెండు రాష్ట్రాల నాయకుల్లో మొదలైనది. ఎవరి రాష్ట్రంలో వారే ఉండి పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకోవాలనే వాదనను కూడా కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా చంద్రన్నతో వాదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇన్ఫార్మర్లు, కోవర్టుల పేరుతో విచ్చలవిడిగా చంపడం మాత్రమే ఛత్తీస్ ఘడ్ మావోయిస్టులకు తెలుసు. సిద్ధాంతం, రాజకీయాలు తెలియని ఛత్తీస్గఢ్ మావోయిస్టులు మాకు స్థావరాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ఏమిటని తెలంగాణ నాయకులు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ, ఆంధ్రా మావోయిస్టులు అంటేనే కోవర్టులు అనే అనుమానంతో ఛత్తీస్గఢ్ మావోయిస్టులు ఆ రెండు రాష్ట్రాలకు చెందిన వారిని దగ్గరకు రానీయడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సందిగ్ధంలో పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.