BJP : తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కాంగ్రెస్, బిఆర్ఎస్ కు దీటుగా పనిచేశారనేది ఇటీవలి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఢిల్లీ పెద్దలు కూడా ఊహించని ఫలితాలను అందుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిదేసి చొప్పున అభ్యర్థులు గెలుపొందారు. అనుకోని రీతిలో ఫలితాలు వచ్చిన తరువాత పార్టీ బలోపేతంపై కేంద్రం పెద్దలు ద్రుష్టి సారిస్తారని తెలంగాణ శ్రేణులు ఆశించారు. కానీ రాష్ట్రంలోని పెద్దలు అందుకు విరుద్దంగా కొనసాగుతున్నారనే అభిప్రాయాలు సైతం కాషాయం శ్రేణుల్లోనే వ్యక్తం కావడం విశేషం.
మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరి భాద్యతలు వారు నెరవేరిస్తే క్రియాశీలంగా పార్టీ బలోపేతం అవుతుందనేది ఢిల్లీ ఆలోచన. కానీ భాద్యతాయుతంగా పనిచేసే వారు ఉండి కూడా లేనట్టే పరిస్థితి తయారైనదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అవుతుందనే ఆరోపణను బీజేపీ శ్రేణులు కార్యకర్తలు ఆశించినంత మేరకు తిప్పికొట్టలేకపోయారు.
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్నారు. ఆ ఇద్దరు కూడా చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. రాష్ట్రానికి వచ్చినప్పుడే రాష్ట్రంలోని పరిపాలన గురుంచి మాట్లాడుతున్నారు. అదికూడా అత్తెసరు మాదిరిగానే కనబడుతోంది. సందర్భం ఏర్పడినప్పుడే ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడు తున్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దూకుడు కూడా తగ్గిందనే అభిప్రాయాలు సైతం పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఎక్కడ కూడా నోరు మెదపకపోవడం శోచనీయం. వీళ్లంతా కూడా వాళ్ళ నియోజకవర్గాలకె పరిమితం అవుతున్నారనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వినబడుతున్నాయి.
పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు భాద్యతలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండలేక పోతున్నారు. రాష్ట్ర పగ్గాలు ఈటల రాజేందర్ కు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. ఆ విషయం కూడా పక్కకు పోయింది. రాష్ట్ర భాద్యతలు ఎవరికో ఒకరికి అప్పగిస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో పార్టీ మరోసారి ఉనికిని కాపాడుకుంటుంది. లేదంటే పార్టీ పరిస్థితి దిగజారిపోవడం ఖాయమంటున్నారు కాషాయం శ్రేణులు