దెబ్బతిన్న అంతర్గత వ్యవస్థ
కోరినంత డబ్బు ఇవ్వాలంటున్న నేరగాళ్లు
News Paper : [పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రంలో ఆ పత్రికకు తిరుగులేదు. పత్రిక సర్క్యులేషన్, ఆడ్స్, విలేకరులు, అన్నిటా ఆ పత్రికనే ముందు కనబడేది. ముందు ఆ పత్రికకు అడ్ ఇచ్చిన తరువాతనే మిగతా పత్రికలకు ఇవ్వాల్సిన పరిస్థితి కనబడింది. అధికారులు విలేకరుల సమావేశం ప్రారంభించాలంటే కూడా ఆ పత్రిక విలేకరి వచ్చిన తరువాతనే నిర్వహించేవారు. అటువంటి పత్రిక నేడు కష్టాల్లోకి వెళ్ళింది అంటే నమ్మలేక పోతున్నారు జర్నలిస్టులు. అసలే ఆర్థిక వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్న పత్రికకు సైబర్ నేరగాళ్లు తగిలారు. ఆ పత్రిక సర్వర్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో దాని అంతర్గత వ్యవస్థ అంతా దెబ్బ తిన్నట్టుగా సమాచారం.
ఆ పత్రిక ఎడిషన్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మధ్యాహ్నం మూడు గంటల తరువాత వెళ్లేవారు. ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకే విధులకు వెళుతున్నారు. సర్వర్ హ్యాక్ కావడంతో మెయిల్ ద్వారా వార్తలను తెప్పించుకుంటున్నారు. దింతో రాత్రి 12 గంటలు దాటినా పనులు పూర్తి కావడం లేదంటున్నారు కొందరు ఉద్యోగులు.
ఆ పత్రిక ఎఫ్.టి.పి హ్యాకర్లు సైబర్ నేరగాళ్లకు చిక్కడంతో అంతర్గత వ్యవస్థ దెబ్బతిన్నట్టుగా సమాచారం. కీలకమైన ఫైల్స్ మొత్తం హ్యాకర్లు తమ చేతుల్లోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా ఒక పత్రిక FTP ఇదేవిదంగా హ్యాకర్ల చేతికి చిక్కింది. అయితే ఆ పత్రిక యాజమాన్యం ఫైర్ వాల్స్ ను ముందు జాగ్రత్తగా సరిగా సద్వినియోగం చేసుకోవడంతో హ్యాకర్ల నుంచి తప్పించుకోగలిగింది. ఈ పత్రికకు మాత్రం సమర్ధవంతమైన స్థాయిలో ఫైర్ వాల్స్ లేనట్టుగా సమాచారం. ఇది హ్యాకర్లకు మంచి అవకాశం కావడంతో సులువుగా సర్వర్ను హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది. కోరినంత డబ్బు ఇచ్చి సర్వర్ తీసుకెళ్ళమంటున్నారని సమాచారం. అయితే యాజమాన్యం నేరగాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చి సర్వర్ ను విడిపించుకుంటుందా ? కొత్త సర్వర్ ను తయారు చేసుకుంటుందా వేచిచూడాల్సిందే ?