Ex CM YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి ఉమ్మడి కడప జిల్లా కంచుకోట. ఆ జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి కుటుంబం చెప్పిందే వేదం. జగన్ పరిపాలనలో వైసీపీ ఒక వెలుగు వెలిగింది. అంత గట్టి పట్టు ఉన్న జిల్లాలో కూటమి ఇటీవలి ఎన్నికల్లో తన ప్రతాపాన్ని చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు వైసీపీ అభ్యర్థులు కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. జగన్ తో పాటు మరో ఇద్దరు మాత్రమే సత్తా చాటుకోవడం విశేషం. ఆ ఇద్దరు కూడా ఎప్పుడు పార్టీ కండువా మార్చుకునేది కూడా చెప్పలేకుండా ఉంది. కొందరు నాయకులైతే పార్టీ నుంచి వెళ్ళిపోతామంటూ బహిరంగంగానే చెప్పేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ కూడా ఒక అడుగు ముందుకు వేశారు. పార్టీని ప్రక్షాళన చేయడానికి ముందుకు వచ్చారు. కష్టపడే మనస్తత్వం ఉన్నవారికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులను కట్టబెడుతున్నారు. ఇప్పటికే కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సురేష్ బాబును పదవి నుంచి తొలగించారు. తన సమీప బంధువు అయిన మేనమామ కు అధ్యక్ష భాద్యతలు అప్పగించారు.
కడపలో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, తన సోదరి ఆయిన షర్మిల ప్రధాన కారణమని జగన్ కు తెలుసు. ఆమెను రాజకీయంగా ఎదుర్కోడానికి మేనమామకు జిల్లా అధ్యక్ష భాద్యతలు అప్పగించినట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అదే విదంగా జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ గా తన బావమరిది నరేన్ రామాంజనేయ రెడ్డి కి భాద్యతలు అప్పగించారు.
సొంత జిల్లాలో తన బందువులకు పార్టీ భాద్యతలు జగన్ అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఒకేసారి ఒకే ఇంటికి చెందిన ఇద్దరికీ పార్టీ పగ్గాలు అప్పగించడం వెనుక కారణం ఏమిటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. కడప సొంత జిల్లా. పుట్టి పెరిగిన జిల్లాల్లో పార్టీని కాపాడుకోలేక పొతే పరువు పోతుంది. ఇతరుల చేతిలో జిల్లా, నియోజక వర్గాల భాద్యతలు పెడితే, వాళ్ళు ఎప్పుడు పార్టీ మారే పరిస్థితి చెప్పలేకుండా ఉంది. కాబట్టి సొంత మనుషుల చేతిలో భాద్యతలు ఉంటె నమ్మకంగా పనిచేస్తారనే జగన్ తన కుటుంబ సభ్యులకు పార్టీ భాద్యతలు అప్పగిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.