Political Leaders : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారమే ప్రధానంగా నాయకులు ప్రచారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ను ఓడించాలనే లక్ష్యంతో ఒక నాయకుడు. గతంలో ఓటమి పాలైన నాయకుడు ఈసారి ఎలాగయినా గెలవాలనే పట్టుదలతో మరొక నాయకుడు. ఇలా ఏపీ లో 175 అసెంబ్లీ స్థానాల్లో నాయకులు పోటా, పోటీగా ప్రచారం చేశారు. జగన్ ను అధికారం నుంచి దించాలనే కసితో కూటమి నాయకులు ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థులను ఓడించి రెండోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో జగన్ మోహన్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారు.
175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి, కాంగ్రెస్, అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులు పోటీ చేశారు. ప్రతి నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఓటర్లు కూడా భారీ ఎత్తున స్పందించారు. 2019 కంటే కూడా ఎక్కువగానే నమోదయినది. 83 శాతం పోలింగ్ నమోదు కావడంతో అభ్యర్థుల్లో గుబులు మొదలైనది. అభ్యర్థుల తరుపున అగ్రనేతలు వచ్చి ప్రచారం చేసినా గెలుపు, ఓటమిలపై అనుమానం వెంటాడుతూనే ఉంది.
ప్రత్యర్థి పై గెలవడానికి కొందరు అభ్యర్థులు 50 నుంచి 100 కోట్లు ఖర్చు చేశారనే ఆరోపణలు వ్యక్తమవు తున్నాయి. రాష్ట్ర పరిపాలన పగ్గాలు ఎవరు చేత పట్టినా ఇబ్బంది లేదు. కానీ తన నియోజకవర్గంలో తానూ గెలిస్తే తనదే అధికారం అవుతుంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడలేదు. మహిళలకు చీరలు, మిక్సీ లు, కుక్కర్లు పంచిపెట్టారు. పురుషులకు మందు అందజేశారు. పది మంది కలిస్తే విందు చేసుకోడానికి అడిగినంత ఇచ్చారు. యువతకు క్రికెట్ కిట్ లు ఇచ్చారు. వీటితోపాటు ఒక్కో ఓటుకు ఇంత అంటూ ముట్టజెప్పారు కొందరు అభ్యర్థులు.
ఇంత ఖర్చు చేసిన పోటీ చేసిన నాయకులకు గెలుస్తామనే నమ్మకం లేదు. కూటమి , వైసీపీ నాయకులు ఒకరి కంటే ఒకరు పోటీపడి ఖర్చు చేశారు. దీనితో విజయం సాధిస్తామనే నమ్మకం కుదరక నిద్రపట్టడం లేదని కొందరు నాయకులు తమ అనుచరుల వద్ద వాపోతున్నారు.