Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి గనుల్లో ఖాళీగా ఉన్న సర్ఫేస్ జనరల్ మజ్దూర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏరియా అధికారులను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం-సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియయన్ -ఏఐటీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీరామ్ పూరా ఏరియా ఆర్ కె -5 గని పనిస్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్ కే బాజీ సైదా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ….
గత సంవత్సరం యాజమాన్యం 108 సర్ఫేస్ జనరల్ మజ్దూర్ పోస్టులను భర్తీ చేయగా అందులో కొందరు కార్మికులు బేసిక్ తగ్గిందనే కారణంతో పాత కేటగిరీలలోకి వెళ్లారని వివరించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. కాబట్టి ఏర్పడిన ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవలే యాజమాన్యం శ్రీరాంపూర్ ఓసిలో డిప్యూటేషన్ కొరకు 30 మంది కార్మికులను తీసుకుంటామని ప్రకటించడం జరిగిందన్నారు. డిప్యూటేషన్ ఇవ్వకుండా ఖాళీలను సీనియార్టీ ప్రకారం భర్తీ చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటేషన్ ఇవ్వడం వలన అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి డివిజన్లో ఉన్న సర్ఫేస్ జనరల్ మజ్దూర్ ఖాళీలను సీనియార్టీ ప్రకారం వెంటనే భర్తీ చేయాలని ఎస్ కే బాజీ సైదా ఈ సందర్భంగా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జిఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, గొల్లపల్లి రామచందర్, ఫిట్ కార్యదర్శి గుడిగంటి నరసింగా రావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి ఆఫ్రొజ్ ఖాన్, ట్రేడ్స్ మేన్స్ నాయకులు సురేష్, సత్తిరెడ్డి, జిపి రావు, భోగమధునయ్య, శ్రీకాంత్ , జడల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.