Singareni : సింగరేణిలో కొత్త బొగ్గు గనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ, ఐఎఫ్ టీయు నాయకులు డిమాండ్ చేశారు. గోదావరిఖనిలోని RG.1.డివిజన్ 2A గని వద్ద చలో హైదరాబాద్ పోస్టర్ ను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని న్యూడెమెక్రసి నాయకులు ప్రకటించారు.
ఈ సందర్బంగా ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ…… రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు కాకపోవడంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే విదంగా కార్మికులకు వడ్డీ లేని రూ : 20 లక్షల ఋణం కూడా మంజూరు కావడంలేదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వన్ టైం సెటిల్మెంట్ క్రింద మానవత దృక్పథంతో డిపెండెంట్ కార్మికుల మారు పేర్లను సవరించి వెంటనే వారికి ఉద్యోగాలు ఇచ్చే విదంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలన్నారు.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలన్నారు. డిస్మిస్ కార్మికులకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలు, సింగరేణి కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ ఈ నెల 20 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అదే రోజు ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేపట్టామని, ఈ ధర్నాను విజయ వంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ, ఐ ఎఫ్ టి యు నాయకులు ఈ నరేష్, జి మల్లేశం, ఈ రామకృష్ణ, శ్రీకాంత్, ప్రసాద్, ఎం దుర్గయ్య, ఎం కొమరయ్య, రవికుమార్.తదితరులు పాల్గొన్నారు.