సకాలంలో వేతనాలు చెల్లించాలి
హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలి
11న శ్రీరాంపూర్ లో ఏఐటీయూసీ ధర్నా
Singareni : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ యూనియన్ కార్యాలయంలో ఎఐటియుసి బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రొజ్ ఖాన్ , బ్రాంచ్ అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్ లు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో 33 వేల మంది పైచిలుకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వారికి కనీస వేతనాలు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు.
కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో అమలవుతున్న హైపర్ కమిటీ వేతనాలను సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. హై పవర్ కమిటీ వేతనాలు అమలయ్యేవరకు జీవో నెంబర్ 22 ప్రకారం వెంటనే వేతనాలను చెల్లించదానికి యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
2022 సెప్టెంబర్లో 18 రోజుల సమ్మె సందర్భంగా యాజమాన్యం ALC సమక్షంలో చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలు పరచాలని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నెల కాంట్రాక్టు కార్మికులకు ఏడో తేదీన వేతనాలు చెల్లించాలని ఒప్పందం ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా పర్మినెంట్ కార్మికులతో సమానంగా సెలవులు మంజూరు చేయాలనీ వారు ఈ సందర్బంగ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న శ్రీరామ్ పూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమానికి కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు రాచర్ల చంద్రమోహన్, ఖాతరాజు ప్రభాకర్, కార్యదర్శి బూర వీరేశం, సహాయ కార్యదర్శి చారి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.