RS Praveen : డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి. ప్రభుత్వ అధికారిగా ఆయన ఎక్కడికి వెళ్లిన గౌరవానికి లోటు ఉండేది కాదు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ అధ్యక్షుల తరువాత అంతటి ప్రాధాన్యత ఉండేది. రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం సహజం. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే అయ్యిందంటున్నారు ఆయన అభిమానులు, సహచరులు. ఒకటి తరువాత ఒకటి రెండు పెద్ద భాద్యతలను వదులుకొని గులాబీ కండువా కప్పుకుంటే ఆయన స్థాయికి తగిన విధంగా ప్రాధాన్యత బిఆర్ఎస్ లో కనబడుటలేదనే అభిప్రాయాలు రాజకీయవర్గాలతోపాటు, ఆయన సహచరుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవిని వదిలిపెట్టి బిఆర్ఎస్ లో చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాగర్ కర్నూల్ నుంచి బిఆర్ఎస్ టికెట్ పై పోటీ చేశారు. ప్రచారానికి కేసీఆర్ వెళ్ళలేదు. ఫలితాల్లో మూడో స్థానమే దక్కింది. ఓటమి తరువాత ఆయన ప్రాధాన్యత లేని నాయకుడై పోయారనే అభిప్రాయాలు సైతం అయన సహచరుల్లో వ్యక్తమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొండిచేయి చూపారు. ఉన్న అవకాశాలు చేజారిపోయాయి.
ఇక మిగిలింది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలే. ఆ ఎన్నికల వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేచిఉండక తప్పదు. పార్టీ సమీక్ష సమావేశాలు జరిగే సమయాల్లో కూడా ఆయనను అంతగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్పుడపుడు మీడియా ముందు మాత్రమే ఆయన కనబడు తున్నారు. కానీ అయన స్థాయికి తగిన గౌరవం కనబడుటలేదని, రాబోయే ఎన్నికల వరకు ఆయన పార్టీలో కొనసాగుతారా, లేదా అనే అనుమానాలు సైతం వస్తున్నాయని ఆయన అభిమానులు, అనుచరులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.