AP BJP : ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ ను తూర్పారబట్టాయి. గల్లీ నాయకుడి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు మూడు పార్టీల వారు జగన్ ను ఎండగట్టాయి. అధికారం దక్కింది. జగన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. పదవిని కాపాడుకోడానికి అసెంబ్లీలో సంతకానికి జగన్ పరిమితమయ్యారు. ఇంతవరకు బాగానే కొనసాగింది కూటమి ఐక్యత. కానీ ఇటీవల కొన్ని పరిమాణాలను గమనిస్తే కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన నేతలు జగన్ మాటకు, మాట బదులిస్తూ కట్టడి చేస్తున్నారు. కానీ కమలం మాత్రం జగన్ విషయంలో వారితో జతకట్టడంలేదు. ఎందుకు ఈ మౌనం అనే సందేహాలు ఏపీ ప్రజల్లో కలుగుతున్నాయి. అంతే కాదు టీడీపీ, జనసేన నేతల్లో కూడా అనుమానం కలుగుతోంది.
గతంలో ఏపీ కి కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు చంద్రబాబును విమర్శించారు. ఇప్పుడు కూటమి ఏర్పాటు చేసిన పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు వచ్చినా జగన్ ను పల్లెత్తు మాట అనడంలేదు. చంద్రబాబు ప్రతిపక్షములో ఉన్నప్పుడు విమర్శించిన కమలం పెద్దలు, ఇప్పుడు జగన్ ను తమ ప్రసంగాల్లో ప్రస్తావించక పోవడంతో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ అంటే గిట్టని వారు సైతం ఏపీ లో అనేక మంది నేతలు ఉన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, పురందేశ్వరి వంటి నేతలు కూడా ఎందుకో మౌనంగానే ఉంటున్నారు.
ఇటీవల జగన్ పొదిలి, రెంటపాళ్ల లో పర్యటించినప్పుడు అపశృతి చోటుచేసుకుంది. పొదిలి లో పోలీసులపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. కేసు నమోదు చేశారు. రెంటపాళ్ళలో జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ రెండు సంఘటనలపై కమలం నేతల నుంచి స్పందన టీడీపీ, జనసేన ఆశించినంతగా రాలేదు. టీడీపీ సోషల్ మీడియాలో కూడా తెలుగు తమ్ముళ్లు ఈ విషయాలపై అనుమానం వ్యక్తచేశారు. కమలం నేతలకు జగన్ పై ఇంతలోనే ఎందుకంత సానుభూతి వచ్చిందనే ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
——————————————
పొలిటికల్ బ్యూరో
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్
——————————————