No vacancy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యిందంటే చాలు… కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు పగటి కళలు కంటారు. సీఎం తో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా హస్తినకు వెళుతారు. సీఎం తన పని తాను చేసుకుంటారు. ఎమ్మెల్యేలు మాత్రం ఢిల్లీ పెద్దల ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఆరునెలలు దాటింది. కొందరికే మంత్రివర్గంలో బెర్త్ దొరికింది. ఇంకా కొందరు ఆశపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారనే గుసగుసలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఒక రోజు ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు మరికొందరు కూడా ఢిల్లీ బాట పట్టారు. మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కాబోతున్నదని పుకార్లు గుప్పు మన్నాయి.
ప్రస్తుతానికి సీఎం వద్దనే విద్య, మున్సిపల్,హోమ్, జిఏడి, శాఖలు సీఎం చేతిలోనే ఉన్నవి.
నాలుగు రోజులపాటు సీఎం ఢిల్లీ లోనే గడపటంతో మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఖరారు అయినట్టే అని ఆశావహులు సంబరపడి పోయారు. వారి ఆశలను అడియాశలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చాలా సున్నితంగా, సుతిమెత్తగా మంత్రి వర్గ విస్తరణపై సెలవిచ్చారు. మంత్రివర్గ విస్తరణ జరుగుతదని మీకు ఎవరు చెప్పారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నో వేకెన్సీ అంటూ మింగుడు పడని విషయాన్ని చెప్పేశారు.మంత్రి వర్గ విస్తరణపై చర్చకు అవకాశమే లేదు. సీఎం మాట వినగానే బుగ్గ కారులో తిరుగుతామని ఆశించిన వారంత కూడా ఒక్కసారి బేజారైపోయారు.
కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి కొందరు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అదేవిదంగా పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారు. ఇంకా ఆదిలాబాద్ వంటి ఉమ్మడి జిల్లాలు కూడా మంత్రి పదవికి నోచుకోనివి ఉన్నవి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి ఉంది. గులాబీ గూటి నుంచి వచ్చే వారు ఖచ్చితంగా ఎందరు ఉన్నారో ఇంకా తెలియదు. గులాబీ ఎమ్మెల్యేల చేరిక కార్యక్రమం ముగిసిన తరువాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న మంత్రులతోనే పరిపాలన కొనసాగుతుందనే అభిప్రాయాలను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.