Congress : గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకులను ఎదుర్కొన్నప్పుడే కాంగ్రెస్ లో ఎదుగుతారు. అంతే కాదు ఎవరిని ఎక్కడ కాపాడుకోవాలో, అక్కడ కాపాడుకుంటేనే కోరిన కోరికలు తీరుతాయి. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ శత్రువులు ఉండరు. వాళ్లలో వాళ్ళే శత్రువులు పుడతారు. దేశంలో ఎక్కడ విన్నా ఇదే వినబడుతుంది. ఒకరు పైకి ఎదుగుతా ఉంటె, మరొకరు కిందకు లాగుతారు. అందుకె రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన వారు ఇతర పార్టీలకు భయపడరు. సొంత పార్టీ నేతలకే భయపడాల్సిన పరిస్థితి ఉంటది.ఎమ్మెల్యే టికెట్ కావాలంటారు. లేదంటే ఎమ్మెల్సీ అంటారు. ఎదో ఒక కోరిక తీరిన తరువాత మంత్రి పదవి కావాలంటారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక పరిస్థితి కూడా ఉండదు. కావాలనే గాంధీ భవన్ లో ఒక దరఖాస్తు పడేస్తారు. ఎందుకంటే టికెట్ వచ్చిన వ్యక్తి సంధి మార్గాన వచ్చి ఎంతో కొంత ముట్టచెబుతాడని. అంతే కాదు ఆయన వెంట పట్టుమని పది మంది కూడా రారు. కానీ నాకు కార్పొరేషన్ పదవి కావాలంటాడు. చైర్మన్ పదవి కావాలంటాడు. పార్టీ కార్యాలయాల్లో కూర్చొని విలేకరుల సమావేశంలో సొంత పార్టీపైననే విమర్శలు, డిమాండ్ చేస్తుంటారు. గాంధీ భవన్ లోకి గొర్రెలను కూడా పంపి నిరసన తెలుపుతారు. అయినా ఎవ్వరిని కూడా పార్టీ నొప్పించదు. పల్లెత్తు మాట అనదు.
ఎన్టీ రామారావుపై పోరాటం చేసి 1990 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయన ఐదేళ్లు పదవిలో ఉండలేదు. ఆ ఐదేళ్ల కాలంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సీఎం పదవి చేపట్టారు. కాంగ్రెస్ లో ఎదిగే నాయకులను ఇలా కిందకు లాగుతారు అనడానికి, క్రమశిక్షణకు ఇదొక తార్కాణం. 2004 లో రాజశేఖర్ రెడ్డి సీఎం కావడాన్ని తట్టుకోలేని వారు కొందరు ఢిల్లీ లో చెవులు కొరికి రావడం జరిగింది.
కాంగ్రెస్ లో క్రమశిక్షణకు మరొక తార్కాణం…. 1999లో ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్నారు. ఆయన కృష్ణ జిల్లా పర్యటనకు వెళ్ళేటప్పుడు తన వెంట కారులో ఉన్న నాయకున్ని సామినేని ఉదయభాను, అతని అనుచరులు కలిసి చితకబాదారు. కారు అద్దాలు పగలగొట్టి దాడి చేశారు. వెంటనే రాజశేఖర్ రెడ్డి నందిగామ లో వసంత నాగేశ్వర్ రావు ఇంటిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉదయబానును ఆరేళ్ళ పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దాడి జరిగిన ఆరు నెలలకే వచ్చిన ఎన్నికల్లో సామినేని ఉదయభానుకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. జగ్గయ్యపేట కు ఎమ్మెల్యే అయ్యారు.
వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి పై ఇటీవల ఫిర్యాదులు గాంధీ భవన్ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు వెళ్లాయి. ఆమెపై చర్యలు తీసుకోని నేపథ్యంలో మేము ఎదో ఒక నిర్ణయం తీసుకుంటామంటూ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నే హెచ్చరించారు. చూద్దాం క్రమశిక్షణ కమిటీ భాద్యతలు మోస్తున్న మల్లురవి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఇంచార్జ్ ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.