Mancheryala BJP : మంచిర్యాల జిల్లాల్లోని కమలం నేతల్లో లుకలుకలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్, బిఆర్ఎస్ అభ్యర్థిగా నడిపెల్లి దివాకర్ రావ్, బీజేపీ అభ్యర్థిగా రఘునాథ రావ్ బరిలో నిలిచారు. ఇక్కడ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. అంతర్గతంగా ముగ్గురు కూడా ఒకటే, కానీ ప్రజలకు చూడటానికి మాత్రమే మీడియా ముందు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు అనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి నాణానికి మరో వైపు కథ జరిగింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావ్, దివాకర్ రావ్, రఘునాథ్ రావ్ లు పోటీపడ్డారు. పోటీ కూడా హోరా, హోరిగానే జరిగింది. దివాకర్ రావ్ మీద ఉన్న వ్యతిరేకత ప్రేమ్ సాగర్ రావ్ కు అనుకూలమవుతుందనే అభిప్రాయాలు సైతం నియోజకవర్గంలో వినిపించాయి. పోలింగ్ నాడే ప్రేమ్ సాగర్ రావ్ గెలుపు ఖాయమనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యింది. ఎట్టకేలకు ప్రేమ్ సాగర్ రావ్ విజయం సాధించారు. ఒకవేళ ప్రేమ్ సాగర్ రావ్ విజయం సాధిస్తే మంత్రి కావడం ఖాయం అనే అభిప్రాయం కూడా జనంలో వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ముగ్గురు కూడా తమ గెలుపును ఛాలంజ్ గానే తీసుకున్నారు. ఎన్నికల విషయానికి వచ్చే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావ్ ను ఓడించాలనే కసి ఓ ఇద్దరు నాయకుల్లో పెరిగింది. ఆ ఇద్దరిలో ఒకరు చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు. మరొకరేమో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ ప్రథమ శ్రేణి నేత. ఒక్కొక్కరుగా ఐదు కోట్ల రూపాయల చొప్పున పదికోట్ల రూపాయలను ఆ ఇద్దరు నేతలు మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక బీజేపీ కీలక నేతకు అప్పగించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పదికోట్లు ఖర్చు చేసి ప్రేమ్ సాగర్ రావ్ ను ఓడించడానికి ఆ కాషాయం నేతతో మంతనాలు జరిపారు. ఇప్పుడు ఆ మంతనాలు బీజేపీలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
ఈ ఆరోపణలు ఇప్పుడే బయటకు పొక్కడానికి ప్రధాన కారణం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఎందుకంటే శ్రీధర్ బాబు ఇటీవల గోదావరిఖనిలో పర్యటించినప్పుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. నేరుగా చెప్పకున్నా, ప్రేమ్ సాగర్ రావ్ మంత్రి అవుతున్నారని చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ్ సాగర్ రావ్ ను ఓడిద్దామనుకున్న ఇద్దరు నాయకుల పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా తయారైనది. పది కోట్లు తీసుకున్న నాయకుడికి కూడా చెమటలు పడుతున్నాయి. ఓడించి ఇంటికే పరిమితం చేద్దామనుకుంటే ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పడు మంత్రి కూడా అవుతున్నాడు. శ్రీధర్ బాబు చెప్పినట్టు మంత్రి అయితే మాత్రం మనకు ఇంకా తలనొప్పి ఖాయం అంటూ ఆ ఇద్దరు నేతలు, వారి అనుచరులు తలపట్టుకోక తప్పడంలేదు.
ఇది ఇలా ఉండగా ఇంతకూ ప్రేమ్ సాగర్ రావ్ ను ఓడించడానికి ఇద్దరు నేతల వద్ద పది కోట్ల రూపాయలు తీసుకున్న బీజేపీ నేత ఎవరు. ఆ నాయకుడు వాటిని ఎక్కడెక్కడ పంపినీ చేశారు. పది కోట్ల రూపాయలతోనే ఓట్లు చీలి బీజేపీ రెండో స్థానం కు వచ్చిందా ? ఇంకా కమలం నేతల్లో ఎవరెవరికి ఎంత ముట్టింది. ఆ నాయకుడితో ఎవరెవరు పదికోట్లకు భాగస్వాములైనారు. ఇప్పుడు ఆ పదికోట్ల రూపాయల ముచ్చట మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురి నాయకుల్లో నానిపోయింది. జిల్లా బీజేపీ నేతల్లో ఒక్కసారిగా లుకలుకలు బయటకు పొక్కడంతో కొందరు కాషాయం నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.