BJP : కమలం శ్రేణుల్లో హైడ్రా పై భిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి. కొందరు హైడ్రాకు స్వాగతం పలుకుతున్నారు. మరికొందరేమో విభేదిస్తున్నారు. పార్టీ పెదమనుషులే ఒక్కో విధంగా మాట్లాడుతుంటే, కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు త్రిశంకుస్వర్గంలో పడిపోయారు. మాట్లాడితే ఏ నాయకుడి నుంచి మందలింపు వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రజల అపరిష్కృత సమస్యల పరిస్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని కేంద్ర నాయకత్వం చెబుతోంది. కానీ రాష్ట్ర నాయకత్వం వ్యతిరేక దిశలో పయనించడంతో కాషాయం కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రను తెరపైకి తీసుకువచ్చింది. కఠినంగా హైడ్రా అమరవుతోంది. పార్టీలకు అతీతంగా, వ్యాపారస్తులు, సినీ పరిశ్రమ, బడా బాబులవి అని చూడకుండా ఎక్కడ అక్రమం అని తేలితే అక్కడ కూల్చివేస్తున్నారు. హైడ్రాను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు.
హైడ్రా చేపట్టిన చర్యలపై రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో భిన్నాభిప్రాయాలు వెల్లడి కావడం విశేషం.హైడ్రాను స్వాగతిస్తున్నామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు, స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావ్, కవిత తదితర బిఆర్ఎస్ నాయకులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి తమ సహకారం అవసరమనుకుంటే తప్పకుండ సహకారం అందిస్తామన్నారు. పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం అక్రమ నిర్మాణాల కూల్చివేతను పాతబస్తీ నుంచే ప్రారంభించాలని డిమాండ్ చేయడం విశేషం.
ఎంపీ రఘనందన్ రావ్ మాటలు ప్రభుత్వానికి అండగా నిలిచాయి. కానీ మరో ఇద్దరు బీజేపీ పెద్దలు మాట్లాడిన మాటలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అన్నీ తెలిసిన ఆ పెద్ద నాయకులు ఇలా మాట్లాడితే ఎలా అని కూడా కమలం శ్రేణులు కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి హైడ్రాను వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడారు. ఆయన తరువాత వెంటనే ఎంపీ ఈటల రాజేందర్ కూడా హైడ్రా పై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. హైడ్రాను ఉపసంహరించుకోవాలని, ఆ హైడ్రా వెనుక ఉన్న కుట్రను కూడా తాము బయట పెడుతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ ఇద్దరు అగ్రశ్రేణి నాయకులే ఈ విదంగా మాట్లాడేసరికి కిందిస్థాయి నాయకులు తలపట్టుకున్నారు. హైడ్రను అభినందిద్దామా, వ్యతిరేకిద్దామా అనే సందిగ్ధంలో పడ్డారు కమలం నేతలు. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు, కొందరు బీజేపీ నాయకుల్లో సైతం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాల పేరు చెప్పి బడా బాబులకు, పారిశ్రామిక వేత్తలకు మద్దతుగా నిలుస్తున్నారా అనే అనుమానాలు సైతం పార్టీలో వ్యక్తం కావడం విశేషం. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో హైడ్రాతో మొదలైన హైడ్రామా ఎటువైపుకు దారితీస్తుందో అనే చర్చ కూడా మొదలైనది. పెద్ద నాయకుల మాటల్లోనే సఖ్యత లేదు. ఐక్యత అంతకూ కనబడుత లేదు. ఈ పరిస్థితుల్లో మనకు హైడ్రా అవసరమా ? మౌనంగానే ఉందామంటూ పార్టీ శ్రేణులు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.