MODI: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయపతాకాన్ని ఎగురవేయాలని కాషాయ దళం విస్తృత ప్రచారం చేస్తోంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే దీటుగా ప్రచారం చేస్తోంది. ప్రధాన మంత్రి మోదీ, నడ్డా, అమితాషా రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షో లు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పదికి పైగా స్థానాల్లో గెలుపు లక్ష్యముగా బూతు స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులకు చిక్కకుండా పనిచేస్తున్నారు. మోదీ పై కూడా తెలంగాణ అభ్యర్థుల గెలుపు భారం పడింది. ఈ నేపథ్యంలో మోదీ కోసం వేములవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది రాష్ట్ర నాయకత్వం. సభకు ముందు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్న మొదటి ప్రధాన మంత్రి అయ్యారు. దేవస్థానంలో మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మోదీకి దేవస్థానం పూజారులు ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవాలయంపై మొక్కులు తీర్చుకోడానికి వచ్చిన భక్తులకు మోదీ అభివాదం చేశారు. అనంతరం వేములవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.