Minaksi : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ ముందర ఎన్నో సవాళ్లు నిలిచి ఉన్నాయి. పార్టీ గీత దాటితే వేటు తప్పదంటున్న ఆమె ముందు, ముందు ఎలాంటి చర్యలు తీసు కుంటారో అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తలపై ముళ్ల కిరీటం ఉంది.
ఆమె భాద్యతలు స్వీకరించడానికి హైదరాబాద్ చేరుకున్న పరిస్థితులు చూస్తుంటే ఆడంబరాలకు దూరం అంటూ కాంగ్రెస్ శ్రేణులకు సంకేతాలు పంపింది. పార్టీ పనితీరే ప్రధానమంటూ స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరు ఉంది. కొన్ని సందర్భాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఎవరు ఎప్పుడు ఢిల్లీ వెళ్లి అధిష్టానం చెవులు కొరికి వస్తారో తెలియదు. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడి తో పాటు ముఖ్యమంత్రి సమావేశాల్లో చెప్పిన విషయాలకు తల ఊపుతారు . ఆ తరువాత వాళ్ళు చేసేది షరా మామూలే. ఇలాంటి వారిని కూడా మీనాక్షి ఎలా అదుపులో పెడుతారో వేచిచూడాలి.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం మాత్రమే పూర్తయింది. పార్టీ రాష్ట్ర కమిటీ ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. అందులో వర్కింగ్ ప్రసిడెంట్ పదవికి తీవ్రమైన పోటీ ఉంది. రాష్ట్ర స్థాయి పదవుల కోసం ఆశావహులు కూడా ఎక్కువగానే గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మీనాక్షి కి కత్తిమీది సాములా తయారై ఉన్నది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆశపడుతున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉన్నది. కార్పొరేషన్ పదవులను ఆశించే వారు కూడా ఎక్కువగానే కనబడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ త్యాగం చేసిన వారు ఇప్పుడు మాకు న్యాయం కావాలంటున్నారు.
కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది ఎమ్మెల్యేల సమస్య సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళింది. ఒకవేళ ఆ పదిమంది ఎమ్మెల్యేల ఉప ఎన్నిక వస్తే, పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి మీనాక్షి పైననే ఉంది. రాష్ట్రంలో మంత్రి పదవి ఆశించే వారు తక్కువేమి లేరు. మంత్రి వర్గ విస్తరణ సమస్య కూడా కీలకమై ఉన్నది. మంత్రి పదవి ఆశించే వారందరికీ కావాలంటే కుదరదు. ఈ సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే రాబోయే స్థానిక ఎన్నికల సమరం కూడా మీనాక్షి నటరాజన్ కు కత్తిమీది సాము మాదిరిగానే కనబడుతోంది. సర్పంచ్ నుంచి మొదలుకొని జిల్లా పరిషత్ చైర్మన్ వరకు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సమస్యలన్నిటినీ దాటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ముందుకు ఎలా వెలుతారో వేచి చూడాల్సిందే.