Father Desire : మా నాన్న పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. ఎటువంటి రాజకీయ కుటుంబం మద్దతు లేకుండానే ఆయన పార్లమెంట్లో అడుగు మోపారు. నన్ను పార్లమెంట్ సభ్యుడి హోదాలో చూడాలనే కోరిక ఆయనలో కలిగింది. అందుకే ఆయన నన్ను కూడా ఎంపీ గా చూడాలనుకున్నారు. నన్ను పార్లమెంటుకు పంపారు. ఆ విదంగా మా తండ్రి కోరిక నెరవేరింది.
మా నాన్నకు కలిగిన కోరికనే నాకు కూడా కలిగింది. నా కొడుకును కూడా పార్లమెంట్ సభలో అడుగు పెట్టాలనే ఆశ నాలో పుట్టింది. అందు కోసమే నేను నా కొడుకును ఎంపీ హోదాలో చూడాలనుకున్నాను. మా నాన్న కోరిక నాతోని తీర్చుకున్నప్పుడు, నేను కూడా నా కోరికను నా కొడుకుతో తీర్చుకుంటున్నాను. అందుకనే నేను నా కొడుకును రాజకీయాల్లోకి తీసుకు రావడం జరిగింది. అని ఒక సందర్భంలో కాకలు తీరిన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఒక నాయకుడు పలికిన మాటలు అవి.
ఈ ముచ్చట తీర్చు కున్నది ఎవరో కాదు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ముగ్గురు నాయకులది. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి 1967 లో గడ్డం వెంకట స్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అప్పటి వరకు ఆయనకు ఏ రాజకీయ కుటుంబం అండగా లేదు. ఒంటిచేత్తోనే విజయం సాధించారు. వరుసగా ఏడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికయ్యి తిరుగులేని నాయకుడయ్యారు. కేంద్ర మంత్రి వర్గంలో పలు మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన పేరు ఉంది. ఈరోజు అయితే అయన కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజకీయాల్లో అడుగు పెట్టారో, అదే కండువాతో అయన చివరి శ్వాస వదలడం విశేషం.
వెంకటస్వామి వారసుడిగా ఆయన రెండో కుమారుడు డాక్టర్ వివేక్ వెంకట స్వామి రాజకీయ ప్రవేశం చేశారు. కాని తండ్రి మాదిరిగా రాజకీయ చదరంగం లో విఫలం అయ్యారనే పేరు ఉంది రాజకీయ వర్గాల్లో. తండ్రి వెంకట స్వామి ఏడుసార్లు పార్లమెంట్ లో ఆడుగుపెడితే వివేక్ మాత్రం ఒకే ఒక్క సారి ఎంపీ గా విజయం సాధించడం కొసమెరుపు. 2009 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి పోటీచేసి ఒకే ఒక్క సారి విజయం సాధించడం విశేషం. తాజాగా అయన చెన్నూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
తాజాగా వెంకట స్వామి మనవడు, వివేక్ కుమారుడు గడ్డం వంశీ కృష్ణ రాజకీయ ప్రవేశం చేశారు. తండ్రి వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచినప్పుడు ఆయన గెలుపు కోసం వంశీ విస్తృత ప్రచారం చేశారు. అప్పుడే పెద్దపల్లి పార్లమెంట్ రాజకీయ వర్గాలు ఊహించాయి. వంశీ కూడా రాబోయే ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేయడం ఖాయమని గుసగుస మొదలైనది. అందరూ ఊహించినట్టుగానే వంశీ కాంగ్రెస్ జెండా మోశారు. టికెట్ సాధించారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు.