Yadadri : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు శుభవార్త చెప్పారు. భక్తులకు ఇకనుంచి నెట్టింట్లోకి స్వామి దర్శనం రాబోతోంది. దర్శనం, కానుకలు, అన్నదానం, హుండీ కానుక, వసతి వంటి సౌకర్యాలు ఇకనుంచి ఆన్ లైన్ లో పొందే అవకాశం ఏర్పడింది.
యాదాద్రి నరసింహ స్వామి దర్శనం వచ్చే భక్తుల సంఖ్య రోజు, రోజుకు పెరిగిపోతోంది. ఆలయంలో వివిధ రకాల సేవల కోసం టికెట్ పొందడానికి అప్పటికప్పుడు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల ఇక్కట్లను గమనించిన ఆలయ నిర్వాహకులు ఆన్ లైన్ సేవలకు ముందుకు వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఇటీవల ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తూ ఆదేశాలు జారీచేసింది. తాజాగా తిరుపతి దేవస్థానం నిర్వహణ ప్రకారం సేవలను కూడా ఆన్ లైన్ లో తీసుకు రావడం విశేషం.
తిరుమల తరహాలోనే నరసింహ స్వామి కి మాడవీధులు, స్వామికి నిత్య పూజలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనం, ప్రసాదం పంపిణి సేవలకు కూడా ఆన్ లైన్ లోనే భక్తులు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. 300 రూపాయల టికెట్, 150 రూపాయల టికెట్ దర్శనం కూడా ఆన్ లైన్ సేవలోకి తీసుకు వచ్చారు ఆలయ నిర్వాహకులు.
ఆన్‌లైన్‌లో ‘yadadritemple.telangana.gov.in ‘ వెబ్‌సైట్ ను సందర్శించి అన్ని రకాల సేవలకు టికెట్ పొంది నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో భక్తులు బుకింగ్ చేసుకునేవారు కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార కార్డు నంబర్లు, గోత్ర నామం, పూజ వివరాలు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి , దర్శనం తేదీ, ఎన్ని టికెట్లు, చిరునామా వంటి వివరాలన్నీ పూర్తి చేయాలి. ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారు తూర్పు రాజగోపురం వద్ద టికెట్ పై క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని ఆలయం లోనికి రావడానికి అవకాశం ఉంటుందని ఆలయ ఈఓ భాస్కర్ రావ్ తెలిపారు.