home guard : కూటి కొరకు కూటి విద్యలు అన్నారు. కానీ ఆ పిరికెడు మెతుకుల కోసం వాళ్ళ జీవన విధానాన్నే మార్చుకున్న వాళ్లు సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారికి వివక్షత ఎదురవుతోంది. ఉపాధి అవకాశాలు వారికి ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కానీ వారిని ఆదుకోవాలని ఇప్పటివరకు ప్రభుత్వాలకు కూడా ఆలోచన రాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్లకి పోలీస్ శాఖలో హోమ్ గార్డ్ ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రావడం విశేషం. వాళ్లు ఎవరో కాదు.
ట్రాన్స్ జెండర్స్. హైదరాబాద్ లో సుమారు వెయ్యి మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికి హోమ్ గార్డ్ ఉద్యోగాలు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ట్రాఫిక్ ని నియంత్రించడానికి హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న పోలీస్ సిబ్బంది సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ట్రాన్స్ జెండర్స్ ను ట్రాఫిక్ హోమ్ గార్డ్ గా నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
అర్హులైన వారిని ముందుకు ఎంపిక చేస్తారు. వారికి పది రోజుల పాటు శిక్షణ పోలీస్ శాఖ ఇచ్చిన తరువాత నిబంధనల మేరకు నియామకం చేసుకుంటారు. నియామకం అయిన ట్రాన్స్ జెండర్స్ ట్రాఫిక్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. విధుల్లో చేరిన వారికి ప్రత్యేక యునిఫామ్ తోపాటు ప్రతినెల నిర్దేశించిన మేరకు వేతనం ఉంటుంది.