Film Industry : గడిచిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వంకు అండగానే నిలిచింది తెలుగు చిత్ర పరిశ్రమ. అప్పటి ప్రభుత్వం ఏ పని చేసినా పొగడ్తలతో ముంచేది. సోషల్ మీడియాలో కూడా తమ వంతుగా ప్రభుత్వ పనితీరును ప్రచారం చేసేవారు కొందరు సినీ పెద్దలు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఎందుకో సినీ పరిశ్రమ మూగబోయిందనే ప్రచారం సాగుతోంది.
కొత్తగా రాష్ట్రము ఆవిర్భవించిన తరువాత చిత్ర పరిశ్రమపై కొందరు బిఆర్ఎస్ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇద్దరిమధ్య ఏమి జరిగిందో ఏమోకానీ సినీ పరిశ్రమ, గులాబీ నేతలు దగ్గరయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ, సహకారం అందిస్తోంది. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దగ్గరగా పరిశ్రమ రావడంలేదు. అందుకే ఆయన కొంత మేరకు చిత్ర పరిశ్రమ పై అసంతృప్తితో ఉన్నట్టు పరిశ్రమలో కొందరు అభిప్రాపడుతున్నారు.
అప్పుడు బిఆర్ఎస్ కు అండగా ఉండి, ఇప్పుడు దూరంగా ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి పరిశ్రమను పల్లెత్తు మాట అనడంలేదు. పరిశ్రమను ఇబ్బంది పెట్టేవిదంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తించడం లేదు. ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా సహాయ, సహకారం అందిస్తున్నారు. పెద్ద బడ్జెట్ తో విడుదల అయిన సినిమాలకు అదనపు ఆటలకు అనుమతి ఇస్తున్నారు. అదేవిదంగా టికెట్ ధరల పెంపు విషయాన్నీ కూడా పట్టించు కోవడంలేదు. పరిశ్రమ వారు ఎవరు ఏది అడిగినా కాదనకుండా అనుమతులు కూడా ఇచ్చేస్తున్నారు. పరిశ్రమకు చెందిన వారు ఏ పని గురించి ఎవరు వచ్చినా వాయిదా వేయకుండా తిప్పించు కోవడంలేదు.
ఇంతచేస్తున్నా పరిశ్రమ నుంచి ప్రభుత్వం ఆశించినంత ఫలితం రావడంలేదు. ప్రభుత్వానికి పరిశ్రమ నుంచి ప్రచారం జరగాలని సీఎం కోరుతున్నారు. అదేవిదంగా సినిమా థియేటర్లలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రకటనలు రావాలని కోరారు. ఆ విషయంపై ఇప్పటి వరకు కూడా పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. అదే విదంగా ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి సినిమా థియేటర్లలో ప్రకటనలు ఉండాలని కోరినా స్పందన రావడంలేదని ప్రభుత్వ వర్గాల సమాచారం.