Congress : తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో 15 లోకసభ, 100 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందని, అందుకు తానే భాద్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. అప్పటి ఎన్నికల ఫలితాలు దేవుడెరుగు. కానీ ప్రస్తుతం సీఎం పరిపాలనకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గండం కానుంది. ఇది ఒక్క సీఎం కే కాదు, పార్టీకి కూడా సవాలే.
పార్టీ అధికారంలో ఉండి పార్టీ అభ్యర్థి ఓటమి చెందడం అనేది మంచి పరిణామం కాదు. ప్రతిపక్షాలకు కూడా కోతికి కొబ్బరికాయ దొరికినట్టే అవుతుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సీఎం కు విజయాన్ని తెచ్చి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ పై నిత్యం దుమ్మెత్తి పోస్తూ, కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటూ గులాబీ శ్రేణులు ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సవాల్ తో కూడుకున్నది. అభ్యర్థిని ఎంపిక చేయడం సీఎంకు కత్తి మీద సామే అవుతుంది. ఇప్పటీకే ఆరుగురు టికెట్ నాకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ లో అభ్యర్థిని ప్రకటించే వరకు ఆశలు కల్పిస్తారు. చివరికి ఎవరో ఒకరు ఎంపికవుతారు. టికెట్ దక్కని వారు అసంతృప్తికి లోనవుతారు. వారంతా టికెట్ దక్కిన వ్యక్తికి అండగా నిలబడటమే పార్టీలో పెద్ద సమస్య.
జూబ్లిహిల్స్ లో ముస్లిం ఓటు బ్యాంక్ కీలకం. మజ్లిస్ సపోర్టు సైతం తప్పనిసరి. పార్టీలో బలమైన అభ్యర్థి కనబడుతలేరు. ఇప్పుడు క్యూలో ఉన్నవారంతా కూడా ఎమ్మెల్యే పదవి కోసం ఆరాటపడుతున్నవారే. నియోజకవర్గంలో పెద్దగా పట్టున్న నాయకులు కాదు. బీజేపీ,జనసేన, టీడీపీ జతకడితే కాంగ్రెస్ అభ్యర్థికి కష్టకాలమే అవుతుంది. బిఆర్ఎస్ కు సానుభూతి దక్కడం అనేది కంటోన్మెంట్ తార్కాణం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఒక్క సీఎం కే కాదు పార్టీ కూడా పేరు దక్కించుకోవడం తప్పనిసరంటున్నారు రాజకీయశ్రేణులు.
పొలిటికల్ బ్యూరో,
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్.