OYC with Tension : తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే ఎంఐఎం కు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన తరువాత కూడా ఆ నియోజకవర్గం ఎంఐఎం పార్టీకి కంచుకోటే అయ్యింది. ఆ నియోజకవర్గం కాకలు తీరిన నాయకుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కి పెట్టింది పేరు. ఇప్పటికి వరుసగా నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కానీ ఆయన వెంట బీజేపీ పడుతోంది. ఎలాగయినా ఓడించాలనే పట్టుదలతో బీజేపీ పెద్దలు నడుం బిగించారు. మోదీ, అమిత్ షా కూడా ఆ నియోజకవర్గంలో ప్రచారానికి ముందుకు వచ్చారు. ఆ ఇద్దరు నాయకులు పర్యటించారంటే అసదుద్దీన్ ఒవైసీ ని ఓడించాలని ఎంత కసి ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు దీటుగా హైదరాబాద్ నియోజకవర్గం నుంచి మాధవీ లత ను పార్టీ పెద్దలు బరిలో దింపారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కార్వాన్, గోషామహల్ అసెంబ్లీ స్థానాల్లో కాషాయం పార్టీ బలంగా ఉంది. చార్మినార్, చాంద్రాయణ గుట్ట, మలక్ పేట, యాకత్పూరా నియోజకవర్గాల కంటే ఆ రెండు నియోజక వర్గాల్లోనే ఎక్కువ పోలింగ్ నమోదయినది. అసదుద్దీన్ ఒవైసీ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గెలుస్తామనే ధీమాను పైకి ప్రదర్శిస్తున్నారు. కానీ లోపల మాత్రం ఆందోళన ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో 46.06 శాతం మాత్రమే పోలింగ్ నమోదయినది. ఎంఐఎం కు గట్టి పట్టున్న చాంద్రాయణ గుట్ట, యాకూత్ పూర, చార్మినార్ నియోజకవర్గాల్లో 42 నుంచి 48 శాతం మధ్యనే పోలింగ్ నమోదయినది. అదేవిదంగా మలక్ పేట్ కూడా మంచి పట్టు ఉన్న నియోజకవర్గము. అక్కడ కూడా ఓటర్లు అంతగా ఈ ఎన్నికలను అంతగా పట్టించుకోలేదు. తనకు మంచి గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లోనే ఓటర్లు ముందుకు రాకపోవడంతోనే అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన చెందుతున్నట్టుగా సమాచారం.
బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఎంఐఎం పార్టీకి గట్టి పోటీనే ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటించారు. ప్రచారంలో హోరెత్తించారు. ముస్లిం సమస్యలపై స్పందిస్తూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమె ప్రచారాన్ని తట్టుకోలేక అసదుద్దీన్ ఒవైసి కూడా హిందువుల దేవాలయాల్లో వచ్చి తీర్థ ప్రసాదాలను తీసుకోక తప్పలేదు. హిందూ, ముస్లిం వేరు కాదు, మనమంతా ఒక్కటే అనే భావన కల్పిస్తూ ఒవైసి ప్రచారం చేయక తప్పలేదు.
కార్వాన్, గోషామహల్ ప్రాంతాల్లో 55 శాతం పోలింగ్ నమోదయినది. ఈ రెండు నియోజకవర్గాల్లో మాదవి లతకే ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపారు. ఆ రెండు ప్రాంతాల్లో అధిక మంది ఓటర్లు ఎంఐఎం పేరు పలకడానికి కూడా ఇష్టపడరు. అంతేకాదు ఆ రెండు నియోజకవర్గాల్లో హిందూ దేవాలయాల్లో దర్శనం చేసుకొని హారతి తీసుకోవడం విశేషం. కొంత వరకు హిందువుల అడుగుజాడల్లో నడిచినప్పటికీ ఎక్కడో తెలియని ఆందోళన అసదుద్దీన్ ఒవైసీ లో కనబడుతోందనే అభిప్రాయాలు హైదరాబాద్ నియోజకవర్గంలో వ్యక్తం కావడం విశేషం.