Dy CM Pavan Kalyan : గడిచిన ఆరునెలల కాలంలో ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన అధినేత, తాజా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కెమెరా ముందు నిలబడలేదు. మేకప్ వేసుకోలేదు. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడపడంతో నటనకు కొద్దిరోజుల పాటు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పూర్తిచేయాల్సిన భాద్యత ఆయనదే. ఎన్నికల్లో ఆయన అనుకున్నది సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతే కాదు ఆయన పార్టీ తరుపున పోటీచేసిన 21 మంది అభ్యర్థులు కూడా విజయం సాధించారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి గా భాద్యతలు కూడా నిర్వహిస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వ భాద్యతలు, మరోవైపు నియోజక వర్గం అభివృద్ధి, పార్టీ ని మరింత అభివృద్ధి చేయడం వంటి భాద్యతలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాలతోపాటు, సినీ పరిశ్రమలో కూడా వ్యక్తం అయ్యాయి. ఎన్నికల ప్రచారం ఆరంభానికి ముందే ఆయన కొన్ని సినిమాలను ఒప్పుకున్నారు. వాటికీ సంబంధించిన షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ కు ముందుకు వస్తేనే పెండింగ్ ఉన్న సినిమాల షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
బుధవారం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలో ఉన్నప్పుడు అయన అభిమానులు ఓజి, ఓజి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన స్పందిస్తూ నన్ను ఎన్నుకున్నందుకు అభివృద్ధి చేయాలి. కానీ సినిమాలకు, రాజకీయాలకు సమయం సరిపోదు. కాబట్టి సమయం దొరికినప్పుడు రెండు, మూడు రోజులు సినిమాలకు సమయం కేటాయిస్తానని నిర్మాతలకు చెప్పానని అభిమానుల సమక్షములో వివరించారు. పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పగానే అభిమానులు సంతోషంగా గంతులు వేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమా లకు కూడా సమయం కేటాయిస్తాడనేది స్పష్టం అయ్యిందనే అభిప్రాయాలు ఏపీ లో వ్యక్తం అవుతున్నాయి.