మృతుల్లో ఇద్దరు కీలక నేతలు
పోలీసులకు గాయాలు
మావోయిస్టు పార్టీకి భారీగా నష్టం
Encounter : తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి – ములుగు జిల్లాల సరిహద్దుల్లో గురువారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నారని తెలిసింది. ఈ ఎన్కౌంటర్ తో మావోయిస్టు పార్టీ కి భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సంబంధింత పోలీస్ అధికారులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి- ములుగు జిల్లాల సరిహద్దుల్లోని కరకగూడెం మండలం పరిధిలోని కల్వల నాగారం అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బలగాలు గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టాయి. అదే సమయంలో మావోయిస్టుల నుంచి ఎదురుకాల్పులు ప్రారంభ కావడంతో బలగాలు కూడా కాల్పులు ప్రారంభించినట్టు సమాచారం. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు ఉన్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. మృతి చెందిన ఇద్దరి కీలక నేతల్లో ఒకరు ములుగు జిల్లా కమిటీ సభ్యుడు కుంజ వీరన్న అలియాస్ లచ్చన్న ఉన్నారు.
లచ్చన్న భార్య తులసి ఖమ్మం జిల్లా చర్ల ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తోంది. మృతి చెందిన లచ్చన్న పై రాష్ట్ర ప్రభుత్వం రూ : పది లక్షల రివార్డు కూడా ప్రకటించింది. మృతి చెందిన లచ్చన్నది చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపాడు సొంత గ్రామం. లచ్చన్నపై 50 కి పైగా పోలీస్ కేసులు నమోదయి ఉన్నాయి. విధ్వంసాలు చేయడంలో లచ్చన్న కీలక పాత్ర పోషిస్తాడని సమాచారం. లచ్చన్నతో పాటు యాక్షన్ టీం కమిటీ సభ్యుడు విజేందర్ కూడా ఉన్నాడు.
సంఘటన స్థలంలో ఒక ఏకే 47 తుపాకీతోపాటు మరికొంత నిత్యావసర వస్తువులు, ఆయుధ సామాగ్రి పోలీస్ బలగాలకు లభించాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీస్ లకు కూడా గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం. తప్పించుకున్న వారి కోసం ప్రత్యేక పోలీస్ బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.