కష్టకాలంలో పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్న.
మంత్రి పదవే కావాలంటున్న MLA ప్రేమ్ సాగర్ రావ్
మంత్రి కాకుంటే PSR క్యాడర్ లో నిరాశ తప్పదు
అదిష్టానంకు తలనొప్పిగా మారిన వ్యవహారం.
Congress : తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితోనే మంత్రిగా ప్రమాణం చేస్తామనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం పెద్దలు చర్చలు జరిగినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం మీడియాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లా లోని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆశలు పెట్టుకున్నారు.
మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, చెన్నూర్ నుంచి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల వద్ద బోలెడన్ని ఆశీస్సులు పుష్కలంగా ఉన్నవి. ఎవరికి వారే మంత్రి పదవి కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పట్టిన పట్టు విడవకుండా రాష్ట్రము నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ వెళ్లి చెవులు కొరికి రావడానికి కూడా వెనుకాడటంలేదు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు. ముగ్గురి ఆశలను గమనించిన కాంగ్రెస్ అధిష్టానంకు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మంచిర్యాల నుంచి కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేసిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ కూడా మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రేమ్ సాగర్ రావ్ కె మంత్రి పదవి పక్కా అంటూ అయన అనుచరులు ఎప్పటినుంచొ పాట పాడుతున్నారు. అధిష్టానం వద్ద ప్రేమ్ సాగర్ రావ్ తన వాదనను బలంగానే వినిపిస్తున్నారు. గడిచిన పదేళ్ల నుంచి పార్టీనే పట్టుకొని ఉన్నాను. నాతొ పాటు క్యాడర్ కూడా కష్టాలను తట్టుకొని జెండా మోసింది. పార్టీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేను ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. పార్టీని ఆదుకున్నాను. పార్టీ నన్ను నమ్మింది. నన్ను ఆదుకున్న పార్టీని , నన్ను నమ్మిన పార్టీని నేను ఎప్పుడు మోసం చేయలేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ స్తానం తెలుగు దేశం పార్టీకి కంచుకోట. అటువంటి కంచుకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేశాను. అటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీని ఆదుకోడానికి ఇప్పుడున్న నాయకులు ఎవరు ముందుకు రాలేదు. ఎల్లవేళలా పార్టీకి అందుబాటులో ఉంటూ, కార్యకర్తల కళ్లెదుటే ఉంటూ పార్టీని కంటికి రెప్పలా కాపాడినందుకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ MLA ప్రేమ్ సాగర్ రావ్ కాంగ్రెస్ పెద్దల ముందు వాదన వినిపిస్తున్నారు.
పార్టీ ని వదిలిపెట్టకుండా ఉంటూ పనిచేసినందుకు ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి. లేదంటే ఎలాంటి బైపాస్ పదవులు తనకు వద్దంటూ మొహమాటం లేకుండా ప్రేమ్ సాగర్ రావ్ ఢిల్లీ పెద్దల వద్ద ముక్కు సూటిగా చెప్పేశారని మంచిర్యాల నియోజక వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత కష్టపడినందుకు ప్రేమ్ సాగర్ రావ్ కు మంత్రి పదవి ఇవ్వలేదంటే, పార్టీలో కష్ట పడిన వారికి పదవులు ఉండవని, కాసులు కుమ్మరించిన వారికే పదవులు దక్కుతాయనే ఆరోపణలు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వ్యక్తం కావడం విశేషం.