Ekadasi : ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈ పవిత్రమైన మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశిని ఒక పర్వదినంలా భక్తులు విశ్వసిస్తారు. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం….
మార్గశిర మాసం శ్రీ మహా విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరమైనదని వేదంలో చెప్పబడింది. ఇదే మాసంలో ధనుర్మాసంతోపాటు వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారడానికి ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని భక్తులు విశ్వసిస్తారు. ఇదే రోజున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరుచుకొని ఉంటాయని వేదంలో చెప్పబడింది. అదే విదంగా మహా విష్ణు మూర్తి కూడా గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం కలిగిస్తాడని వేదం పండితులు చెబుతున్నారు.
ఇదే రోజున వైష్ణవ ఆలయాలన్నీ కూడా వైకుంఠాన్ని తలపించేలా అలంకరించబడుతాయి. ఆలయాలన్నీ కూడా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. భక్తులు భక్తి శ్రద్దలతో ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించు కోవడం వల్లనే ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని వేదంలో చెప్పబడింది. అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ని పది రోజుల పాటు నిర్వహిస్తారు.