Ashadamasam : సూర్యుడు మిథున రాశి నుంచి ప్రయాణమై కర్కాటకరాశి లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తవుతుంది. దక్షిణాయణం ఆరంభమవుతుంది. పితృదేవతలకు దక్షిణాయనం ప్రీతికరమైనదని వేదంలో చెప్పబడింది. వర్షఋతువు కూడా ఆషాఢమాసం నుంచే మొదలవుతుంది. ఈ మాసంలో చేసే దానం, పూజలు, పారాయణాలు మంచి ఫలితాలను అందిస్తాయి.
అదేవిదంగా సముద్రం, నదుల్లో చేస్తే ముక్తిదాయకం. బ్రాహ్మణులకు, వేదపండితులకు చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేసినచో తెలిసి, తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటె తొలగిపోతాయని వేదంలో చెప్పబడింది. ఈ సంవత్సరంలో ఆషాడ మాసం జూలై ఆరో తేదీన మొదలవుతుంది. ఆగష్టు నాలుగో తేదీన ముగుస్తుంది. ఆషాడ మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ విదియ రోజు పూరీ జగన్నాధుడి రథయాత్ర ఘనంగా జరుగుతుంది. అదేవిదంగా బలభద్ర, సుభద్ర రథయాత్రలు కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే సప్తమిని భాను సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం దిక్కుకు పయనిస్తూ మూడు నెలల తరువాత మధ్యకు చేరుకుంటాడు. అదే రోజు పగలు, రాత్రి, సమయాల్లో నిమిషం, ఘడియల్లో తేడా ఉండదు. సరిసమానంగా ఉంటాయి.
ఇదే మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథి రోజు విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళుతాడు. ఆ సందర్భాన్ని తొలి ఏకాదశిగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. అంతే కాదు తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజు నుంచే చాతుర్మాస వ్రత దీక్ష కూడా మొదలు కావడం విశేషం. ఇదే మాసంలో బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించి భక్తి శ్రద్దలతో పండుగల జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారికి బోనం ను భక్తితో ఉపవాసం ఉండి తయారు చేసి నైవేద్యంగా అర్పిస్తారు.
ఈ మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. కొత్త నీరు చేరుతుంది. కాబట్టి తాగే నీరు పరిశుబ్రమైనదా ? లేదా ? చూసుకొని తాగాలి. లేదంటే అనారోగ్యానికి గురవుతారు. అదేవిదంగా కొత్తగా పెళ్లైన పెళ్లి కూతురును అత్తవారి ఇంటిలో ఉంచకుండా పుట్టింటికి పంపిస్తారు.