Congress : సినిమా ప్రపంచం వేరు. రాజకీయం వేరు. సినిమాల్లో విజయం సాధించినంత సులువుగా రాజకీయాల్లో సాధించలేం. ఇది చాలామంది అనుభవించారు. తెలంగాణ ఉద్యమం చేపట్టింది. పార్టీ స్థాపించింది. అయినా రాజకీయంగా పురోగతిలేదు. చివరకు పార్టీని బిఆర్ఎస్ లో విలీనం, ఆ తరువాత బీజేపీ, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నప్పటికీ ఆశలు అడియాశలే అయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రాజకీయంగా ఎదుగలేకపోతోంది. అందుకే ఆమె రాజకీయాలకు దూరం కావడం ఖాయమనే అభిప్రాయాలు సైతం వ్యక్తమ వుతున్నాయి. ఆమె ఎవరో కాదు.. తెలుగు సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన విజయశాంతి
ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పేరుకు మాత్రమే కాంగ్రెస్ కండువా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఏడాది పూర్తయ్యింది. గడిచిన కాలంలో ఆమెకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత కనబడలేదు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆమె కనబడుటలేదు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్టేననే అభిప్రాయాలూ సైతం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
పార్టీలో ప్రాధాన్యత లేదు. పార్టీ పెద్దలు కూడా పట్టించుకోవడంలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది రోజులపాటు సోషల్ మీడియా లో మాత్రం స్పందించారు. పార్టీ తోపాటు, ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం విజయశాంతికి పిలుపురావడంలేదు. పార్టీలు మారడంతోనే ఆమె నైతిక విలువలు దెబ్బతిన్నాయనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. ఆమె రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్టేననే అభిప్రాయాలు సైతం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.