Home » BC Reservation : స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

BC Reservation : స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

BC Reservation : దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహించి, జనాభా దామాషాలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి.. సామాజిక న్యాయాన్ని పాటిస్తామని కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. బీసీలకు సామాజిక న్యాయం అందించే లక్ష్యంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి విజయభేరీ బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేసింది. బడ్జెట్ లో బీసీలకు లక్ష కోట్లు కేటాయిస్తామని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ విదంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వివిధ బీసీ సంఘాల నాయకులు హైద్రాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగ పలు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ …

సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయంలో స్పష్టతనివ్వడం లేదన్నారు. కేవలం కుల, ప్రజా సంఘాల ఒత్తిడితో మొక్కుబడిగా కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుందని, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కులగణనకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకపోవడం బీసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనమన్నారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేపట్టి, 42 శాతానికి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చడం బీసీలను అవమానించడమే అవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే జూన్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడం, ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగానికి అదేశాలివ్వడం అవకాశవాద రాజకీయమే అవుతుందన్నారు. కులగణన చేయకుండా, బీసీలకు 42 శాతానికి రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామనడం బీసీల గొంతు కోయడమే అవుతుందని వారు ఆరోపించారు. అదే జరిగితే బీసీలు రాజకీయంగా మరోసారి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారి ఆవేదన వ్యక్తం చేశారు. .కాంగ్రెస్ పార్టీ, దాని అగ్ర నాయకత్వానికీ బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. తక్షణమే రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

. తెలంగాణలో గతంలో బీసీలకు 33 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం సరికాదన్నారు. దీనివల్ల మెజారిటీ ప్రజలైన బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న చాలా కులాలకు కనీసం స్థానిక సంస్థల్లోనూ ప్రాతినిధ్యం లేకుండాపోయిందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వని ఆధిపత్య కుల పార్టీలు.. స్థానిక సంస్థల్లోనూ బీసీల ప్రాతినిథ్యాన్ని అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలను సహించేందుకు బీసీ సమాజం ఏ మాత్రం సిద్ధంగా లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు రాజీలేని పోరాటాలకు, త్యాగాలకు బీసీ జనసభ నాయకత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, హైదరాబాద్లో నిరసన ర్యాలీలు, ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా, గాంధీభవన్ ముట్టడి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించాఋ. వెనకబడిన వర్గాల ప్రజల దశాబ్దాల న్యాయమైన డిమాండ్.. సామాజిక న్యాయ సాధన పోరాటంలో బీసీ మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, విద్యార్థులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములై సహకరించాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్, బీసీ టైమ్స్, బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు, టి జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, మున్నూరుకాపు సంఘం నాయకులు పురుషోత్తం పటేల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్, ఓయూ విద్యార్థి నాయకుడు లింగం శాలివాహన, యాదవ సంక్షేమ సంఘం నాయకులు మధు యాదవ్, మల్లేష్ యాదవ్, టీవైజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శెట్టి హరికృష్ణ యాదవ్, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర నాయకులు కొంపెల్లి రాజు, మల్లేష్, ఆరె కటిక సంఘం నాయకులు సంతోష్ తదితరులు ఉన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *