Brandy : మద్యం ప్రియుల్లో కొందరికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలుపనుంది. మరికొందరికి చేదు వార్త ప్రకటించనుంది. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచింది. తాజాగా బ్రాందీ ధరలను కూడా పెంచాడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ధరల పెంపుపై బేవరేజిస్ కార్పొరేషన్ అధికారులు కూడా గణాంకాల్లో మునిగిపోయారు. కొద్ధి రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు నివేదిక సైతం ఇవ్వనున్నారు.
బ్రాందీ పైన ఉన్న ప్రస్తుత ఎమ్మార్పీ ధర ఆధారంగా ధరలను పెంచనున్నారు. ఒక బాటిల్ ధర సుమారు 500 రూపాయలు ఉంటె దానిపైన కనీసం పది శాతం పెంచాలనేది ప్రభుత్వం ఆలోచనగా సంబంధిత అధికారుల సమాచారం. రెండు నుంచి ఐదు రకాల బ్రాందీల ధరలను పెంచితే వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు.
వాటి ఆధారంగా ప్రభుత్వం బ్రాందీ బాటిల్ ధరలను పెంచడానికి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీర్ ధరలను పెంచిన ప్రభుత్వం, తాజాగా బ్రాందీ ధరలను పెంచడానికి నిర్ణయం తీసుకోనున్నది. అయితే చీఫ్ లిక్కర్ ధరను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం.