Tirupathi : తిరుమల-తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంకు ఉపయోగించే నెయ్యి కల్తీదేనని విషయం తేలిపోయింది. ఈ విషయం దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న వారిని చట్టపరంగా శిక్షించాలని హిందు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా దర్యాప్తుకు ఆదేశించింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం నివేదిక కూడా కోరింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన అయితే అందరి కంటే ఎక్కువగానే కనబడుతోంది. ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. వెంకన్న స్వామి ని క్షమించాలని కోరుతూ పదకొండు రోజుల పాటు దీక్ష చేపట్టారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. వాటితోపాటు పవన్ కళ్యాణ్ సంప్రోక్షణ, శుద్ధి, మహా శాంతి యాగాన్ని చేపట్టారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విరమించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటో తేదీన అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల కొండ పైకి చేరుకుంటారు. మరుసటి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్టోబర్ మూడో తేదీన తిరుపతిలో వారాహి సభ కూడా నిర్వహించనున్నారని జనసేన పార్టీ వర్గాల సమాచారం.