Purandeswari : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. మాజీ కేంద్ర మంత్రి. వాస్తవానికి ఆమె తెలుగు దేశంలో ఉండాల్సిన నాయకురాలు. రాజకీయ సమీకరణాల వలన ఆమె పార్టీలు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ కాషాయం భాద్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో NDA ప్రభుత్వంలో తెలుగు దేశం ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో బీజేపీ భాద్యతలు మోస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి కి మాత్రం కాషాయం శ్రేణులతో ఇబ్బందులు ఏర్పడు తున్నాయి.
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు బీజేపీ తో చేతులు కలిపారు. అదేవిదంగా ఇప్పుడు బాబు అవసరం ప్రధాన మంత్రి మోదీ కి తప్పనిసరి. ఒకరికి ఆర్థిక అవసరాలు. మరొకరికి రాజకీయ అవసరాలు. ఈ నేపథ్యంలోనే ఒకరికి ఒకరు మంత్రి పదవులు ఇచ్చిపుచ్చు కున్నారు. కాబట్టి ఎవరికి ఎవరు తలనొప్పి కాదు. కాలేరు కూడా. తెలుగు దేశం, బీజేపీ పార్టీల నుంచి ఎంపీగా, ఎమ్మెల్యే లుగా, మంత్రులుగా పదవులు పొందిన వారు ఢిల్లీలో, రాష్ట్రంలో ఆనందంగానే ఉన్నారు. రాష్ట్ర పగ్గాలు తెలుగు దేశం చేతిలో ఉన్నవి. కాబట్టి పచ్చ చొక్కా నాయకులకు పరవాలేదు. పార్టీ పదవులతోపాటు, కార్పొరేషన్, నామినేషన్ పదవులు సైతం దక్కుతాయి. కాబట్టి తెలుగు దేశం శ్రేణులకు పదవుల పండుగే అవుతుంది.
బీజేపీ అభ్యర్థులతో పాటు తెలుగు దేశం, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డాం. కాబట్టి మాకు కూడా కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో కావాలనేది కాషాయం శ్రేణుల వాదన. ఇప్పుడు ఈ వాదన పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి తలనొప్పిగా తయారైనది. రాష్ట్ర స్థాయి పదవులు ఇప్పించడం నా వల్ల కాదు. మూడు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డది వాస్తవమే. కానీ పదవులు ఇప్పించడం నాతో కాదు. కావాలంటే మీరు ఢిల్లీ వెళ్ళండి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ పురందేశ్వరి కాషాయం నేతలకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తోందని పార్టీ వర్గాల సమాచారం.
గడిచిన ఐదేళ్లలో జనసేన, తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు వైసీపీ తో ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఆ ఐదేళ్ల పాటు జగన్ బీజేపీతో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నారు. జగన్ తో బీజేపీ నాయకులు ఎలాంటి ఇబ్బంది పడలేదు. కష్టాలు పడ్డవారు అంతా కూడా తెలుగు దేశం, జనసేన నాయకులే. కాబట్టి ఇప్పుడు వారే రాష్ట్ర స్థాయి పదవులపై ఆశపడుతున్నారు. చంద్రబాబు కూడా తెలుగు దేశం, జనసేన పార్టీలకే పదవులు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.