BJP President : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకొంది. రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడప తొక్కారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా కనబడలేదు. అదే విదంగా పార్లమెంటుకు కూడా ఎనిమిది మంది సభ్యులు ఎంపికయ్యారు. ఇది కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు. ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాషాయం జెండా ఎగరవేశారంటే తెలంగాణాలో 56 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తన ఉనికిని చాటుకొందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇంతగా తెలంగాణలో బలం పెరిగినప్పటికీ పార్టీ అధ్యక్షుడి నియామకంలో ఢిల్లీ పెద్దలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది అనుమానంగా ఉంది.
ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అయన రెండు భాద్యతలు నిర్వహించడంతో రాష్ట్ర పార్టీ నిర్ణయాలు సక్రమంగా జరగడంలేదని కాషాయం శ్రేణులు కొందరు అసంతృప్తితో ఉన్నారు. జూలై లోనే రాష్ట్ర పగ్గాలు కొత్త వ్యక్తికి అప్పగిస్తారనే ప్రచారం సాగింది. నెలరోజుల కిందటనే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కే అధ్యక్ష భాద్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. ఎందుకో ఆ విషయం ప్రచారంకే పరిమితం అయ్యింది.
పార్టీ అధ్యక్ష పదవిని మోయడానికి డీకే అరుణ, ఈటల రాజేందర్, రాజా సింగ్, అరవింద్, రఘునందన్ రావు ముందుకు వస్తున్నారు. అధిష్టానం ఇంకా సరైన నిర్ణయం తీసుకోనప్పటికీ కొందరు నేతలు ఢిల్లీలో మాత్రం చెవులు కొరుకుతున్నారు. ఏకాభిప్రాయం కుదిరితేనే రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుంది. లేదంటే బలోపేతం కంటే బలహీనం కావడం ఖాయమనే అభిప్రాయాలు సైతం కాషాయం శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సన్నద్ధమవుతోంది. అధికార పార్టీని తట్టుకొని స్థానిక ఎన్నికల్లో మెజార్టీ దక్కించు కోవాలంటే తొందరగా రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలి. అప్పుడే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చాటుకున్న వైభవాన్ని తిరిగి చాటుకోగలదు. స్థానిక ఎన్నికల్లో తన బలాన్ని చాటుకుంటేనే మరో నాలుగేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది. లేదంటే పార్టీ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడటం ఖాయమనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.