BJP : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. జూలై ఒకటిన కొత్త అధ్యక్షుడి ఎంపికకు ముహుర్తాన్ని ఢిల్లీపెద్దలు ఖరారు చేశారు. ఎంపికకు సంబందించిన నోటిఫికేషన్ ను ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రకటించనుంది. ఎన్నికకు సంబందించిన ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎంపికకు ఢిల్లీ నాయకులు సిద్ధం కావడంతో కొత్త దళపతి ఎవరనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. ఆ వెంటనే ఆయన ఎంపీగా, కేంద్ర మంత్రిగా భాద్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం అందుబాటులో ఉండటం లేదనే అభిప్రాయం ఉంది. పలువురి ప్రముఖుల పేర్లు వినిపించినప్పటికీ ఎవరిని కూడా పార్టీ పెద్దలు నియమించలేదు.
ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి కూడా ఆయనతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. సోమవారం పార్టీ నియమావళి ప్రకారం నామినేషన్ స్వీకరిస్తారు. నామినేషన్ పరిశీలించిన అనంతరం జూలై ఒకటిన అధ్యక్ష ఎన్నికను నిర్వహిస్తారు. ఇప్పటికే అధ్యక్షుడు ఎవరనేది ఖరారు అయ్యిందని సమాచారం. కానీ పార్టీ సంప్రదాయం ప్రకారం అధ్యక్షుడిని ఎంపిక చేసి ప్రకటిస్తారు.