TTD:ఏడుకొండలపై వెలసిన తిరుమల,తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనంను ఘనంగా నిర్వహించడానికి టిటిడి అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునే విధంగా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి భక్తుడు స్వామి దర్శనం చేసుకొని వెళ్లెవరకూ ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం, స్వామి లడ్డు ప్రసాదం, పొంగలి, వడ పంపిణి చేయడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
వైకుంఠ ద్వారా దర్శనం జనవరి 10,11,12 తేదీల్లో ఉంటుంది. ఈ మూడు రోజులకు సంబందించిన దర్శనం టికెట్లను జనవరి 9న ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభిస్తారు. మూడు రోజులకు సంబంధించిన వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లను కేవలం తిరుపతి, తిరుమల ప్రాంతాల్లోనే ఇవ్వడానికి టిటిడి ఏర్పాట్లు చేసింది.
రెండు ప్రాంతాల్లో మొత్తం 91 కౌంటర్లలో టికెట్లను భక్తులకు ఇవ్వనున్నారు. తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో 87 టికెట్ కౌంటర్లు, తిరుమల లో నాలుగు కౌంటర్లో దర్శనం టికెట్లను ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్టు టిటిడి ఈఓ శ్యామల రావు ప్రకటించారు.ప్రతి టికెట్ కౌంటర్ వద్ద భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విశాలమైన క్యూ లైన్ లు ఏర్పాటు చేస్తున్నారు.