నీట మునిగిన 8 లెవల్స్
గంటకు 6 లక్షల లీటర్ల వేడి నీటి ప్రవాహం
బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
Singareni : సింగరేణిలో భూగర్భంలో నుంచే బొగ్గు ఉత్పత్తి చేస్తారు. లోతయిన ప్రాంతం నుంచి బొగ్గు కోసం తవ్వకాలు చేపట్టడం వలన నీరు ఉబికి వస్తుంది. ఆ నీరు కూడా చల్లగానే ఉంటుంది. ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో ఇదే తెలిసిన విషయం. కానీ సింగరేణి చరిత్రలో తొలిసారి ఓ భూ గర్భ గని నుంచి వేడి నీరు రావడం సంచలనమైనది. భూమి పొరల్లో నుంచి వేడి నీరు రావడం సాధారణమే. కానీ సింగరేణి చరిత్రలో మాత్రం తొలిసారి కావడం విశేషం. పదుల సంఖ్యలో భూగర్భ గనులు, ఉపరితల గనులను నిర్మించినప్పటికీ వేడి నీరు రాలేదు.
తాజాగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని కొండాపురం భూగర్భ గని నుంచి వేడి నీరు రావడంతో గని అధికారులు, సూపెర్వైజర్లు, కార్మికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో సల్ఫర్ అధికంగా ఉండటం వలన భూమిలోని నీరు జరిగిన రసాయన చర్యల వలన వేడి నీరు వస్తోందని జియోలాజికల్ అధికారులు సింగరేణి అధికారులకు వివరించారు. గని 300 మీటర్ల లోతులో ఉంది. ఇందులో ఉన్న చిన్న పాయ నుంచి వేడి నీరు రావడాన్ని అధికారులు గుర్తించారు.
గంటకు ఆరు లక్షల లీటర్ల వేడి నీరు గనిలో ప్రవహిస్తోంది. దింతో గనిలో బొగ్గు ఉత్పత్తి చేసే ఆరు పాయలు (ప్రాంతాలు ) నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నీట మునిగిన ప్రాంతాల నుంచి నీటిని గని ఉపరితలానికి తోడివేయడానికి భారీ మోటార్లను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ నీటి ప్రవాహం అదుపు కావడం లేదు. సాధ్యమైనంత తొందరలో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చి బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపడుతామని మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ తెలిపారు.