Telangana : తెలంగాణ స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని రాష్ట్ర హై కోర్ట్ ఆదేశం. రిజర్వేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలి. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా కనబడుటలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను ఎంచుకున్న మార్గంలోనే వెళుతున్నారు. కోర్టు సమయం దగ్గర పడుతుంది. అధికారికంగా రిజర్వేషన్ ఖరారు కాలేదు.
కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ ప్రకటించినప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆయన ఇచ్చిన హామీ అమలయ్యేది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టింది. ఎప్పుడో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలు ఇప్పుడు రిజర్వేషన్ కారణంతో ఆలస్యమవుతున్నాయి.
గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ పై రాజకీయ పండితులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆర్డినెన్స్ కు రాజ్యాంగ అర్హత లేదంటున్నారు. ఒకవేళ కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డికి స్నేహపూర్వక వాతావరణం ఉంటే గవర్నర్ ఆర్డినెన్స్ పై సంతకం చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ శ్రేణులు. దానిపై ఎవరైనా కోర్టుకు వెళితే సమస్య మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ వర్గాలు.
చట్టపరంగా ఎన్నికలకు వెళ్లాలంటే సమయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అనధికారిక రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలను నిర్వహించడానికి సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అనధికార రాజకీయ రిజర్వేషన్ పద్దతి ఇలా చెబుతుంది…. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి. నియోజకవర్గాలను యూనిట్ గా తీసుకొని 42 శాతం టికెట్లు బీసీలకు కేటాయించాలి. కానీ ప్రతిపక్ష పార్టీలు అమలు చేసినా ? చేయకపోయినా ? కొంతమేరకు విమర్శలు మాత్రం ఎదుర్కోక తప్పదు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటే ఇదొక్కటే మార్గమనే అభిప్రాయాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.