Telangana BJP : తెలంగాణలో గడిచిన ఐదేళ్లల్లో భారతీయ జనతా పార్టీ బలపడింది. రాబోయే ఐదేళ్లలో ఇదే ఊపును కూడా కొనసాగించాలనే ఉద్దేశ్యం స్పష్టంగా కనబడుతోంది. అందుకు ఢిల్లీ పెద్దలు పదునైన ఆలోచనలతో కదులుతున్నారు. ఆలోచనలకు తగిన విదంగ రాష్ట్రానికి రెండు బెర్తులను సైతం కేంద్రం అప్పగించింది, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంత్రి పదవిలో చేరారు. కొత్తవారికి పార్టీ భాద్యతలను అప్పగించాలని చూస్తోంది. తెలంగాణ లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతోనే సరిపెట్టుకొంది. 2019 ఎన్నికల నాటికి తన బలాన్ని నాలుగు స్థానాలకు పెంచుకొంది. అంచెలంచెలుగా ఎదుగుతూ 2023 నాటికీ ఏకంగా ఎనిమిది స్థానాలతో ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. అదే విదంగా పార్లమెంట్ స్థానాలను సైతం 2019లో నాలుగు, 2024 లో ఎనిమిది స్థానాల్లో కాషాయం పథకాన్ని ఎగురవేసి సత్తా చాటింది. కాంగ్రెస్ తో సమానంగా విజయాన్ని అందుకొంది. తెలంగాణలో రాబోయేది కూడా మేమే అంటూ సవాల్ విసిరింది.
పార్లమెంట్ ఎన్నికల్లో 36 శాతం ఓట్లు సాధించి కాంగ్రెస్, బిఆర్ఎస్ కు చెమటలు పట్టించింది. సాధించిన ఈ బలంతో వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లాలనే పట్టుదలతో ఉంది. కేంద్రంలో కిషన్ రెడ్డి కి, బండి సంజయ్ కి మంత్రిపదవులను కట్టబెట్టడంతో పార్టీ శ్రేణుల్లో బలం చేకూరింది.
2028 లో వచ్చే ఎన్నికల్లో పగ్గాలు చేపట్టాలనే ఆలోచనతో పావులు కదుపుతోంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, పరిపాలన అనుభవం, బిఆర్ఎస్ లోగుట్టు తెలిసిన వ్యక్తి కావడంతోనే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు పార్టీ భాద్యతలు అప్పగించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. 36 శాతం సాధించిన ఓట్లను సాధించడమే పార్టీ ముందున్న పెద్ద భాద్యత. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అదే ఊపుతో గెలవాలనే పట్టుదలతో ఉంది.
కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన ఢిల్లీ పెద్దలు పార్టీ లో కీలక పదవులను కూడా రాష్ట్రంలోని పలువురికి ఇవ్వనున్నట్టు సమాచారం. పార్టీలో జాతీయ స్థాయి పదవులు, కేంద్రంలో మంత్రి పదవులు వెరసి పార్టీ బలోపేతానికి అవసరమవుతాయని ఆలోచిస్తోంది పార్టీ. ఇది ఏ మేరకు ఫలించనుందో వేచి చూడాల్సిందే.