Home » Chennoor : మంచిర్యాల డీసీసీ ఇలాకాలో కుదేలైన హస్తం

Chennoor : మంచిర్యాల డీసీసీ ఇలాకాలో కుదేలైన హస్తం

డీసీసీ సొంత వార్డు లో ఓటమి
సొంత మున్సిపాలిటీ ని దక్కించుకొని అధ్యక్షుడు
ఓటమికి కారణం ఒంటెద్దు పోకడే కారణమా ?
గెలుపు గుర్రాలకు దక్కని పార్టీ టికెట్

Chennoor : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి. ఆయన పదవీ భాద్యతలు చేపట్టిన రెండు నెలలకే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికతో కాలం కలిసొస్తుందని ఆశించిన ఆయనను కాలం వెక్కిరించింది. బహుశా ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నామని ఆయన అంటారు కావచ్చు. కానీ ఎంతయినా డీసీసీ అధ్యక్షుడికి సొంత పట్టణం క్యాతనపల్లి. అయన పట్టణాన్ని ఆయన కాపాడుకోలేకపోతే పార్టీ శ్రేణుల్లో ఆయనపై ఎటువంటి అభిప్రాయం ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మున్సిపల్ చైర్మన్ కుర్చీ సమస్య ను పక్కకు పెట్టినా, కనీసం ఆయన సొంత ఎడో వార్డును కూడా గెలిపించుకోలేకపోతే ఎలా అని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. క్రీడాకారుడిగా మైదానంలో ఆడటం గొప్పకాదు, గోల్ కొట్టడం ప్రధానమంటున్నారు నేతలు.

అధ్యక్ష భాద్యతలు చేపట్టిన నాటి నుంచే రఘునాథ్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు పెద్దపీట వేశాడంటున్నారు పార్టీ శ్రేణులు. దురుసుగా ప్రవర్తించడం, దూకుడు పెంచి కార్యకర్తలను, సీనియర్ నాయకులను నిర్లక్ష్యముగా చూడటంతోనే క్యాతనపల్లి చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకి దూరమైనదంటున్నారు పార్టీ శ్రేణులు. చివరకు కార్యకర్తలపై చేయి చేసుకోవడం కూడా పెద్ద నష్టాన్ని తెచ్చి పెట్టిందంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ శాఖకు దూరమైన ఒక వ్యక్తి ప్రమేయం కూడా రఘునాథ్ రెడ్డి కి తలనొప్పి తెచ్చిపెట్టిందంటున్నారు. తన సొంత ఏడో వార్డులో గెలుపు అవకాశాలు ఉన్న గుర్రం శ్రీనివాస్ ను కాదని మరో వ్యక్తికీ టికెట్ ఇవ్వగా, చివరకు శ్రీనివాస్ ను విజయం వరించింది. మంత్రి వివేక్ , ఎంపీ వంశీ ల ప్రచారాన్ని కూడా అభ్యర్థులు ఆశించిన మేరకు ఖరారు చేయలేదనే ఆరోపణలు సైతం అభ్యర్థుల కుటుంబాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అనేది రఘునాథ్ రెడ్డి నేర్చుకోవాలంటున్నారు పార్టీ శ్రేణులు.పొత్తు విషయంలో సీపీఐ వారితో చర్చించే సందర్భాన్ని తన హోదాతో ముడిపెట్టుకోవడం కూస సముచితంగా లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాతనపల్లి కుర్చీకాంగ్రెస్ కు దూరమైనదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పట్టణానికి చెందిన మీడియా ను కాదని పక్క ఊరు మీడియాకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఓటమికి కొంత కారణమంటున్నారు పార్టీ నేతలు. పట్టణంలో పలుకుబడి, ఆర్థికంగా, కులబలం, పేరు ప్రతిష్టలు ఉన్న ప్రధాన నేతల ఓటమికి పొత్తు పెద్ద దెబ్బతీసిందంటున్నారు. పలు వార్డుల్లో గెలిచే అవకాశాలు ఉన్న నేతలను కాదని, తనకు నచ్చిన,మెచ్చిన వారికే టికెట్ ఇవ్వడంతోనే ఆయన ఓటమి భారాన్ని ఎత్తుకోక తప్పడంలేదంటున్నారు. గెలవడానికి అవకాశాలు లేని వారి నుంచి పార్టీలో పెద్ద ఎత్తున చేతులు మారినట్టుగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆరోపణలు వ్యక్తం కావడం కొసమెరుపు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *