Home » Chennoor : కష్టాలను మూటగట్టుకున్న చెన్నూర్ కాంగ్రెస్

Chennoor : కష్టాలను మూటగట్టుకున్న చెన్నూర్ కాంగ్రెస్

మంత్రి వివేక్ కు భారీ నష్టం
ఓటమికి భాద్యత మంత్రిదేనా ?
డీసీసీ అధ్యక్షుడి ఇలాకాలో చేజారిన క్యాతనపల్లి కుర్చీ
కనీసం వార్డు కౌన్సిలర్ ను గెలిపించుకోలేని స్థితిలో డీసీసీ అధ్యక్షుడు
చెన్నూర్ లో అత్తెసరు మెజార్టీ

Chennoor : బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా ….బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావెద సుమతీ ….ఈ పద్యం నూటికి నూరు శాతం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికలకు ఆసన్నమయ్యే సమయంలోనే చెన్నూర్ ఎమ్మెల్యే,, రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేగా విజయం. ఎట్టకేలకు మంత్రి పదవి.

ఎంత పట్టుదలతో ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి సాధించుకున్నారో వివేక్ అదే పట్టుదలతో పనిచేయకపోవడంతోనే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి రుచిచూడక తప్పలేదంటున్నారు నియోజకవర్గం ప్రజలు. కొడుకు ఎంపీ, ఆయన మంత్రిగా ఉండి కూడా తన నియోజకవర్గంలోని రెండు అంటే రెండు మున్సిపాలిటీలకు భారీ విజయాన్ని అందించలేక పోవడం శోచనీయం. నియోజకవర్గం లోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పొత్తుల నేపథ్యంలో చేజారింది. అదే విధంగా చెన్నూర్ మున్సిపాలిటీ కూడా చావు తప్పి కన్ను లొట్ట పోయింది అనే సామెతను గుర్తు చేస్తోంది.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే పొత్తుల కోసం క్యాతనపల్లి సీపీఐ నాయకులు మంత్రి వివేక్ తో మంతనాలు జరిపారు. మొదట రెండు వార్డులు మాత్రమే ఇస్తామన్నారు మంత్రి. ఆ తరువాత మూడు, అక్కడి నుంచి నాలుగు వరకు మంత్రి రావడం జరిగింది. పార్టీ పట్టణ కార్యదర్శి కోసం మరొకటి సీపీఐ కోరగా, బలం లేని వారికి ఇవ్వడం దండుగ, ఓడిపోయే వారికి ఇచ్చినా ఫలితం లేదంటూ మంత్రి వివేక్ స్పష్టం చేయడంతోనే పొత్తు బెడిసి కొట్టిందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మంత్రి తో పాటు డీసీసీ అధ్యక్షుడు కూడా సీపీఐ బలం గురించి, నాయకుల గురించి నిర్లక్ష్యంగా మాట్లాడటం కూడా కొంత కారణమంటున్నారు పార్టీ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఇదే అవకాశాన్ని తీసుకున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరినన్ని స్థానాలు ఇవ్వడంతో పొత్తు కుదిరింది. సీపీఐ ఏడు స్థానాలు, బిఆర్ఎస్ 15 స్థానాలకు బరిలో నిలిచాయి. ఈ పొత్తుతో కాంగ్రెస్ ఓటమిపాలై కష్టాలను మూటగట్టుకున్నదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

చెన్నూర్ లో కూడా పరిస్థితిలు పార్టీకి పెద్దగా అనుకూలంగా లేవనే చెప్పవచ్చు. మంత్రి ప్రధాన కేంద్రంలో కూడా 18 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులు 11 గెలిచారు. కావలసిన మెజార్టీ కంటే అదనంగా ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మంత్రికి అత్యధిక ఓటర్లు ఉన్న క్యాతనపల్లి లో పార్టీ ఓటమి కావడం, చెన్నూర్ లో అత్తెసరు మెజార్టీ రావడం మంత్రికి భారీ నష్టమే అంటున్నారు. ఇదే వ్యవహారం ముందు, ముందు కూడా కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటదో ఊహించడం పెద్ద కష్టమేమి కాదు. ఈ ఓటమికి మంత్రిదే అంటున్నారు కార్యకర్తలు.

చుట్టపు చూపు గా వచ్చి, వెళ్లడం, ఎన్నికలు వస్తున్నాయంటేనే మార్నింగ్ వాక్ చేయడం తోనే మంత్రి తన పర్యటనను సరిపెట్టుకుంటున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటనలకు, కింది స్థాయి నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు లేకపోవడం, జెండా మోసిన వారికీ పదవులు ఇప్పించకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, తండ్రీ, కొడుకుల్లో ఏ ఒక్కరు కూడా నియోజకవర్గంలో స్థిరంగా ఉండకపోవడం, కిందిస్థాయి శ్రేణులకు అందుబాటులో ఉండకపోవడం, వేళ్ళమీద లెక్కబెట్టినంత క్యాడర్ కు అందుబాటులో ఉండటం, అధికారం వచ్చినా పార్టీ శ్రేణులు ఆర్థికంగా మరింత నష్టపోవడం వంటి కారణాలతోనే క్యాతనపల్లి చేజారిపోవడం, చెన్నూర్ అత్తెసరు మెజార్టీ సాధించడం జరిగిందంటున్నారు పార్టీ శ్రేణులు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *