రాజన్నలవాడ, మేకల మార్కెట్‌లో ప్రత్యేక పూజలు
ప్రజల సుఖశాంతి కోసం అమ్మవారిని ప్రార్థన
బోనమెత్తిన మాజీ విప్ నల్లాల ఓదెలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రాజన్నలవాడ మేకల మార్కెట్ ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన ఆషాఢమాస బోనాల జాతర భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ విప్ నల్లాల ఓదెలు సంప్రదాయబద్ధంగా బోనమెత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి జాతరలో పాల్గొన్న నల్లాల ఓదెలు ఆధ్యాత్మిక వాతావరణంలో తన్మయత్వం పొందారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి కరుణాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగాయి.

