కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రతిరోజూ కొంత సమయం నడక, వ్యాయామం, శారీరక శ్రమకు కేటాయించడం ఎంతో అవసరమని చాటిచెప్పేందుకు సేవా భారతి ఆధ్వర్యంలో 5కే, 10కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నుంచి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రన్లో వైద్యులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, ఆసుపత్రుల సిబ్బంది, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, యువత తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని, నిత్యజీవితంలో నడకను ఒక భాగంగా చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
ప్రస్తుత జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని నివారించేందుకు నిత్యం వ్యాయామం, నడక వంటి శారీరక కార్యకలాపాలు ఎంతో దోహదపడతాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని, క్రమశిక్షణను పెంపొందించడమే ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కరే లచ్చన్న, న్యాయవాది కొట్టే నటేశ్వర్, బీజేపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు తదితరులు రన్లో పాల్గొని పాల్గొనేవారిని ఉత్సాహపరిచారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల చైతన్యం మరింత పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

