కోస్గి పాంచజన్య సభలో కవిత ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిందేనని పిలుపు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’ రాజకీయంగా వేడెక్కింది. సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘తాను ఎవరి బాణాన్ని కాదని.. బహుజనుల బాణాన్ని, యువత యుద్ధ నినాదాన్ని’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిందేనని ఆమె పిలుపునిచ్చారు. తనకు ప్రజల ఆశీర్వాదం ఉంటే ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్‌రెడ్డితోనైనా పోరాడతానని అన్నారు.
‘జూరాల నుంచి నీళ్లు తెస్తా’……….
పాలమూరు ప్రాంతంలో సాగునీటి సమస్యపై కవిత ప్రధానంగా ప్రస్తావించారు. జూరాల నుంచి నీటిని తీసుకొచ్చి పాలమూరు–రంగారెడ్డి ప్రాంతంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. నీళ్లు, యూరియా, విద్యుత్, రైతు భరోసా, మద్దతు ధర వంటి అంశాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించారు. గతంలో పాలమూరు ప్రాంతానికి నీళ్లు రాకపోవడానికి ఉమ్మడి రాష్ట్ర పాలనను కారణంగా భావించామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని కవిత ప్రశ్నించారు. జూరాల నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం…………..
తెలంగాణలో ప్రతి గ్రామానికి ఒక పాఠశాల, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని కవిత అన్నారు. గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ విద్యా వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎంత పెద్ద అనారోగ్య సమస్య వచ్చినా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే భరించే విధంగా వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు.
సామాజిక న్యాయమే లక్ష్యమని వెల్లడి……
రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోందని కవిత ఆరోపించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలకు వారి జనాభా, అవసరాలకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముదిరాజ్, ముస్లిం, నేతన్న, గీతన్న తదితర వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు రావాలని, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
తనపై వివిధ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ వదిలిన బాణం కాదని, బీఆర్‌ఎస్ వదిలిన బాణం కాదని, బీజేపీ బాణం కూడా కాదని స్పష్టం చేశారు. ‘నేను బహుజనుల బాణాన్ని.. యువజనుల యుద్ధ నినాదాన్ని.. అంబేడ్కర్ వాదాన్ని.. పూలే ఆత్మగౌరవ నినాదాన్ని’ అని కవిత పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మోదీ, కేసీఆర్, రేవంత్‌రెడ్డితో పోరాడుతానన్నారు.
‘చలి చీమల చేతిలో బలమైన సర్పం’……….
సీఎం రేవంత్‌రెడ్డి తనను తాను బలవంతుడిగా భావిస్తూ దురహంకారంతో వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. ‘బలమైన సర్పం చలి చీమల చేతిలో చిక్కి చచ్చినట్లే ఆయనకు పరాభవం తప్పదు’ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రజలు ఇచ్చిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
‘పాంచజన్యం పేరుతో ప్రజా పోరాటం’……
సమాజంలో అధర్మం పెరిగినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊది పోరాటానికి పిలుపునిచ్చినట్లు, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే తమ కార్యక్రమానికి ‘పాంచజన్యం’ అనే పేరు పెట్టినట్లు కవిత వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ తమ రాజకీయ కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. కొడంగల్–కోస్గి వేదికగా తెలంగాణ రక్షణ సేన రాజకీయంగా మరింత విస్తరించే దిశగా ఈ సభను నిర్వహించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

