అమృత్ 2.0 కింద రూ.100 కోట్లతో తాగునీటి పనులు •
ఇందిరమ్మ ఇళ్లు, సెంట్రల్ లైటింగ్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై సమీక్ష
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మందమర్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ సతీష్ కుమార్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్లు తుంగపిండి రాజలింగు, మురళీకృష్ణ, ఎంపీడీఓ రాజేశ్వర్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎస్‌ఆర్ (CSR), డీఎంఎఫ్‌టీ (DMFT) నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ 2.0 పథకం కింద చెన్నూర్ నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నీటి ట్యాంకులు, పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మందమర్రి ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 95 శాతం బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సౌకర్యార్థం సెంట్రల్ లైటింగ్ వ్యవస్థతో పాటు సోలార్ లైట్ల ఏర్పాటు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి రెండు పడక గదుల ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లు పారదర్శకంగా కేటాయించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి కుటుంబానికి వాటి లబ్ధి అందేలా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కబరస్తాన్ అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు రాత్రి వేళల్లో మెరుగైన భద్రత, రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పనులు చేపడుతున్నామని చెప్పారు. నగర అభివృద్ధి నిధులతో మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, నీటి ట్యాంకులు, విద్యుత్ స్తంభాలు తదితర మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణ శాఖల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, గుత్తేదారుల పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని మంత్రి స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను మంత్రి స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, నిబంధనల మేరకు పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రతి ఫిర్యాదుపై సకాలంలో స్పందించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

